Digital War: ఆరితేరిన బీఆర్ఎస్‌.. తేలిపోతున్న కాంగ్రెస్‌!

pr failed for congress

Share this article

Digital War: ప‌దేళ్ల అధికార‌ అనుభ‌వం.. అధునాత‌న టెక్నాల‌జీలు వాడే నైపుణ్యం.. ఏ సంద‌ర్భానికి ఎలా స్పందించాలి.. దేన్ని ఎలా తిప్పికొట్టాలి.. ఎవ‌రిని ఎలా దెబ్బ‌కొట్టాలి అనే అంశాల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌.. ఏం జ‌రిగినా పార్టీ చూసుకుంటుందిలే అనే ధీమా.. అన్నింటికీ మించి ఆ సైన్యాన్ని న‌డిపించే నాయ‌క‌త్వం.. వెర‌సి బీఆర్ఎస్(BRS) సోష‌ల్ మీడియా రోజురోజుకీ తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా గ్రౌండ్‌లో అదే ప‌తేరా చూపించుకుంటోంది. (BRS vs Congress)

ఇదే స‌మ‌యంలో, అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సోష‌ల్ మీడియా మాత్రం రోజురోజుకూ సైలెంటైపోతోంది. ఎన్నికల్లో గెలుపు ఊపు మీద కొన్నాళ్లు జోరు చూపించిన అధికార కాంగ్రెస్ సోష‌ల్ మీడియా ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. కీల‌క విష‌యాల‌పై అవ‌గాహ‌నారాహిత్యం, ఎలా స్పందించాలో తెలియ‌క‌పోవ‌డంతో పాటు, నాయ‌క‌త్వ‌లోపంతో వివిధ సామాజిక మాధ్యమాల వేధిక‌గా ప్ర‌తిప‌క్ష కేడ‌ర్ ముందు చ‌తికిల‌ప‌డిపోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

వైఫ‌ల్యం ఎక్క‌డుంది..?
కాంగ్రెస్ సోష‌ల్ మీడియా, పీఆర్ డిపార్ట్‌మెంట్‌లు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అధికార పార్టీ చేసే ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌తో పాటు.. ప్ర‌భుత్వంలో కీల‌క నాయ‌కులు, మంత్రులే కాదు ముఖ్య‌మంత్రిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, ప్ర‌తిప‌క్ష సోష‌ల్ మీడియా చేస్తున్న ట్రోల్స్‌ను తిప్పికొట్ట‌డంలో విఫ‌ల‌మ‌వుతోంద‌న్న మాట‌లు కేడ‌ర్ నుంచే వినిపిస్తున్నాయి. డిజిట‌ల్ మీడియాను న‌డిపిస్తున్న నాయ‌కులు సైతం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ అంత ఎఫెక్ట్ చూపించ‌లేక‌పోతున్నార‌నేది వాస్త‌వం. కాంగ్రెస్(Congress) సోష‌ల్ మీడియా న‌డిపిస్తున్న ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో ఒక‌టి, రెండు మిన‌హాయించి మిగ‌తావేవీ ఆక్టివ్‌గా క‌నిపించ‌ట్లేదు. అందులోనూ ఎంగేజింగ్ కంటెంట్ క‌నిపించ‌ట్లేదు. ఇక పార్టీ కోసం నిల‌బ‌డే వ్య‌క్తిగ‌త ఖాతాల సంగ‌తి దేవుడెరుగు.

PR failed for congress

మిగ‌తా పార్టీల సంగ‌తేంటి..?
ట్విట్ట‌ర్‌(ఎక్స్‌), ఫేస్‌బుక్ వేధిక‌లు ఇప్పుడు రాజ‌కీయ ప్రచారాలు, విమ‌ర్శ‌ల‌కు ప్ర‌ధాన వేధికలుగా ఉన్నాయి. వీటిని ఏ పార్టీ ఎంత వాడితే.. అంత ప్ర‌భావం ఓట్ల మీద చూపిస్తోంద‌నేది వాస్త‌వం. అందుకే, రెండుసార్లు అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన ట్రంప్ వీటిని మేనేజ్ చేసి గెల‌వ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. అదే స్ట్రాట‌జీ కేంద్రంలో బీజేపీ గ‌త ప‌దిహేనేళ్లుగా పాటిస్తూ వ‌స్తోంది. పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఖాతాల‌తో పాలు, వేల సంఖ్య‌లో యూజ‌ర్లు(కార్య‌క‌ర్త‌లు) త‌మ వ్య‌క్తిగ‌త ఖాతాల నుంచి పార్టీకి ద‌న్నుగా నిలుస్తున్నారు. త‌మ పోస్టుల‌తో ప్ర‌తిప‌క్షాలు, కీల‌క నేత‌ల‌ను మొఖం చూపించుకోకుండా చేస్తున్నారు. ప‌లు రాష్ట్రాల్లోనూ ఇదే అనుస‌రిస్తుండ‌గా.. తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త భిన్నంగా ఉంది.

ఈ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు ప్ర‌త్యేక‌త ఉంది. ఇక్క‌డి అధికార టీడీపీ(TDP), ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YCP)తో పాటు కూట‌మిలో ఉన్న జ‌న‌సేన(Janasena) పార్టీల‌కు స‌మాన‌మైన సోష‌ల్ మేనేజ్‌మెంట్ ఉంది. ఒక‌టి, రెండు శాతాల తేడాతో మూడూ స‌మానంగా పోరాటం చేస్తున్నాయి.. సందేశాల్ని బ‌లంగా జ‌నంలోకి చేర్చ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నాయి. తొలుత‌, టీడీపీ సోష‌ల్ మీడియా ఎక్కువ బ‌లంగా ఉన్న‌ట్లు క‌నిపించినా.. ఐదేళ్ల‌లోనే వైకాపా అంత‌కు రెండింత‌లు పెరిగింది. ప్ర‌స్తుతం అధికార పార్టీ పెడుతున్న కేసుల‌కు భ‌య‌ప‌డి.. అక్క‌డ‌క్క‌డ కొన్ని అకౌంట్లు ఇనాక్టివ్ అయినా.. 80శాతం వ్య‌క్తిగ‌త‌, అధికారిక అకౌంట్లు జోరుగా పోస్టులు పెడుతున్నాయి. జ‌నసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సినీ అభిమానుల ఖాతాల మ‌ద్ద‌తే పుష్క‌లంగా ఉంది. అదే ఆ పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తిరుగులేని శ‌క్తిగా మారుతోంది. వైకాపా ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్ట‌డంలో జన‌సేన టీడీపీ కంటే ఓ అడుగు ముందే ఉందనడంలో సందేహం లేదు.

తెలంగాణ‌లో..?
తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ బ‌ల‌మైన డిజిట‌ల్ సైన్యాన్ని న‌డిపిస్తోంది. విదేశాల నుంచి సైతం ప‌లు అకౌంట్లు ఆక్టివ్‌గా ఉండ‌గా.. ఆ పార్టీ ఎన్నారై విభాగం, ఒక్కో నాయ‌కుడి వ్య‌క్తిగ‌త ఖాతాలు 24గంట‌లూ మేలుకునే ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఏకంగా వంద‌రెట్లు హైప‌ర్ ఆక్టివ్ అయిన ఈ ఖాతాలు.. అధికార పార్టీ నేత‌లనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ టీమ్‌ల‌ను న‌డిపించేందుకు ప్ర‌త్యేక నాయ‌క‌త్వం, మీడియా నిపుణులు, అధునాత‌న సాంకేతిక‌త‌పై ప‌ట్టున నిపుణులు, రీసెర్చ్ విభాగం ప్ర‌త్యేకంగా ప‌నిచేస్తున్నాయి. జ‌నానికి సులువుగా చేరే ప‌త్రిక‌ల క్లిప్పింగుల క్రియేష‌న్‌తో పాటు కీల‌క పాయింట్ల‌పై ట్రోల్స్‌, సెటైరిక‌ల్ కామెంట్లు.. ఈజీగా యూత్‌ని త‌మ‌వైపు తిప్పుకుంటున్నాయి.

అధికార కాంగ్రెస్‌లో మాత్రం ఈ జోష్ క‌నిపించ‌ట్లేదు. డిజిట‌ల్ బృందంలో ప‌నిచేసే ఓ యువ నాయకుడు త‌న ఆవేధ‌న‌ను ఇటీవ‌లే సామాజిక మాధ్య‌మాల్లో పంచుకున్నాడు. స‌రైన దిశ‌లో న‌డ‌వ‌ట్లేదని.. ఎవ‌రికీ క్లారిటీ లేద‌ని.. కీ పాయింట్లు ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నామంటూ ఆ యువ నాయ‌కుడు త‌న బాధ‌ను వెల్ల‌గ‌క్కాడు. ఇందులో నిజం లేక‌పోలేదు.. కాంగ్రెస్‌కు సంబంధించి ఒక‌టో, రెండో అకౌంట్లు మిన‌హాయించి.. వ్య‌క్తిగ‌త ఖాతాలేవీ పెద్ద‌గా జ‌నానికి చేర‌ట్లేద‌న్న‌ది వాస్త‌వం.

ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రుల‌కు సంబంధించిన పీఆర్ఓలు సైతం ప్ర‌మోష‌న్స్‌లో తీవ్రంగా వెన‌క‌బ‌డ్డార‌న్న ప్ర‌చార‌ముంది. ఏడాదిన్న‌ర పాల‌న‌లో చేసిన ఏ ప‌నికీ ప్ర‌జ‌ల్లో గుర్తింపు పెద్ద‌గా ద‌క్క‌క‌పోవ‌డానికి ఈ ప్యాసివ్ మోడ్ పీఆర్ లే కార‌ణం.

దేశంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ‌ల్లో కేర‌ళ కాంగ్రెస్ సోష‌ల్ మీడియా మేనేజ్‌మెంట్ టాప్‌లో ఉంటుంది. కేంద్ర స‌ర్కారును ఎండ‌గ‌ట్ట‌డంలో జాతీయ కాంగ్రెస్ హ్యాండిల్ చేయ‌లేని పోస్టులు, ట్రోల్స్ సైతం కేర‌ళ కాంగ్రెస్ చేస్తుంది. మెళ్లిమెళ్లిగా పార్టీ బ‌ల‌ప‌డ‌టానికి.. అక్క‌డ యూత్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌డానికి కేర‌ళ కాంగ్రెస్ సామాజిక మాధ్య‌మాల పోస్టులే కార‌ణంగా అక్క‌డి నేత‌లు చెబుతున్నారు.

ఇదే కొన‌సాగితే.. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గ‌ల‌వ‌చ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావానిదేముంద‌ని త‌క్కువ అంచ‌నా వేసిన ఎంతోమంది హేమాహేమీలు మ‌ట్టిక‌ర‌వ‌డం చ‌రిత్ర చెబుతోంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *