Danger: జకర్తా, జూన్ 30: ఇండోనేషియాలోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. తీవ్ర వర్షాలు, బలమైన గాలుల మధ్య ల్యాండింగ్ చేస్తున్న బాటిక్ ఎయిర్ విమానం రన్‌వేపై నియంత్రణ తప్పి దూసుకెళ్లింది. సకాలంలో పైలట్లు అప్రమత్తమవడంతో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో విమానం జకర్తా విమానాశ్రయానికి చేరుకుంది. కానీ అప్పటికే వాతావరణం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం, వేగంగా వీచిన గాలులు పైలట్లకు కాస్త ఇబ్బంది కలిగించాయి. ల్యాండింగ్ సమయంలో విమానం కొంతసేపు నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఆ క్షణాలలో రన్‌వేపైకి ఒడ్డుగా దూసుకెళ్లిన విమానాన్ని చూసిన ప్రయాణికులు కంగారుపడ్డారు. అయితే పైలట్లు అత్యంత చాకచక్యంగా స్పందించి, విమానాన్ని సమర్థవంతంగా నియంత్రించారు. రన్‌వేపైకి వచ్చినప్పటికీ పెద్ద ప్రమాదం జరగకుండా విమానాన్ని నిలిపివేయగలిగారు. వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని విమానాన్ని పరిశీలించారు.
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఎటువంటి గాయాలు సంభవించలేదని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలకు విమానాన్ని హ్యాంగర్‌కి తరలించామని చెప్పారు.
ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు కూడా స్పందించారు. ల్యాండింగ్ సమయంలో వాతావరణం తీవ్రంగా ఉన్నదని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులకు మరింత ఆధునిక టెక్నాలజీతో ముందుజాగ్రత్తలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో తుఫానులు, హరికేన్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో, విమానయాన రంగంలో వాతావరణ సూచనల ఆధారంగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక వేళ పైలట్లు కొన్ని క్షణాలు ఆలస్యం చేసి ఉండి ఉంటే ఈ ఘటన పెద్ద ప్రమాదంగా మారిపోయేది. అదృష్టవశాత్తూ వారు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అపాయాన్ని తప్పించగలిగారు. ప్రస్తుతం ప్రయాణికులు విమానాశ్రయంలో భద్రతతో ఉన్నారు. అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
