Cricket: మైదానంలో రాక్ష‌సుడు.. 12 మందిపై క్రికెట‌ర్ లైంగిక దాడి!

Cricket west indies

Share this article

Cricket: వెస్టిండీస్ జాతీయ జట్టుకు చెందిన ఓ ప్రముఖ ఆటగాడిపై లైంగిక ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. గయానాలో నివసించే ఓ యువతి .. లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తోడుగా, ఇంకా పదకొండు మంది మహిళలు అతనిపై అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంటున్నారని సమాచారం. అంటే మొత్తం 12 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రికెటర్ పేరు ఇంకా అధికారికంగా బయటపడలేదు. కానీ అతడు గయానాకు చెందిన వ్యక్తి అని, ప్రస్తుతం వెస్టిండీస్ జాతీయ జట్టులోనూ కీలక ఆటగాడిగా ఉన్నాడని గయానా మీడియా నివేదిస్తోంది. ఆయన పేరు బయటకు రాకుండా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జ‌ట్టులో కీల‌క ఆట‌గాడే..!
“మైదానంలో ఓ రాక్షసుడు తిరుగుతున్నాడు” అని గయానాలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కవర్ కథనంగా ప్రచురించింది. ఈ క్రికెటర్ ప్రస్తుతం జట్టులో ముఖ్యమైన స్థానంలో ఉన్నాడని, అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఇది క్రికెట్ ప్రపంచానికి పెద్ద దెబ్బేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బాధిత మహిళలు ఇచ్చిన సమాచారం ప్రకారం, అతడు వారిని బెదిరిస్తూ, మానసికంగా, శారీరకంగా వేధించినట్టు పేర్కొన్నారని తెలిసింది. ఇందులో కొందరిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మాత్రం అతనిపై ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఇది మహిళా సంఘాల ఆగ్రహానికి కారణమైంది.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందిస్తూ, “మాకు పూర్తి వివరాలు తెలియవు. ఈ విషయంలో మ‌రింత‌ సమాచారం వచ్చాకే స్పందించగలుగుతాం” అని బోర్డు ప్రెసిడెంట్ కిషోర్ షా అన్నారు. ఓ లాయర్ చెప్పిన ప్రకారం, ఈ ఏడాది జనవరిలో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఈ ఆటగాడు పాల్గొన్నాడు. ఆ మ్యాచ్‌లో విండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన తర్వాత, స్వదేశానికి తిరిగివచ్చిన సమయంలో అతనికి హీరోలా స్వాగతం ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో అతడి భవిష్యత్తు ఏమవుతుందో? బోర్డు అతన్ని రక్షిస్తుందా లేదా విచారణకు సహకరిస్తుందా అన్నది వేచి చూడాలి. క్రికెట్ అభిమానులు, మహిళా సంఘాలు మాత్రం నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే నిజ‌మైతే వెస్టిండిస్ క్రికెట్ టీంకి భారీ దెబ్బ ప‌డిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *