Olympics: క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఆటే.. కానీ భారత్‌లో మాత్రం ఓ మతం కంటే ఎక్కువే. అందులో ఆటగాళ్లు.. అభిమానులకు దేవుళ్లు. ఈ ట్రెండ్ భారత్ దాటి ఇతర దేశాల్లోనూ మెల్లిమెల్లిగా పాకుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లోనూ క్రికెట్‌కు అభిమానులు పెరుగుతున్నారని నివేధికలు చెబుతున్నాయి. అయితే, వీటికి మరింత జోష్ అందిస్తూ ఒలింపిక్ కమిటీ ఈ ఏడాది సంచలన నిర్ణయం తీసుకుంది. లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్‌కు కూడా చోటు కల్పించింది. ఒలింపిక్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్.. దాదాపు ఓ మూడు నెలలు అంతటా ఇవే వార్తలు. ఏ దేశానికి ఎన్ని పతకాలో లెక్కలతోనే మూణ్నెళ్లు ముగిసిపోతాయి. ఇప్పుడు ఈ పోటీల్లో క్రికెట్ చేరడంతో మరింత ఆట మరింత రసవత్తరంగా మారనుంది.
రెండు టీ-20లు.. చివర్లో మెడల్ మ్యాచ్‌లు!
2028లో జరిగే ఈ క్రీడా సంరంభంలో భాగంగా జూలై 12 నుంచి క్రికెట్ మ్యాచులు మొదలుకానున్నాయి. గ్రూప్ దశలో ప్రతి టీమ్ రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. జూలై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచులను నిర్వహించనున్నారు. క్రీడాకారులకు విశ్రాంతినివ్వడం కోసం జూలై 14, 21 తేదీల్లో ఎలాంటి మ్యాచ్‌లు జరగవు. రోజుకు రెండు గ్రూప్ దశ మ్యాచులు మాత్రమే నిర్వహించనుండగా, ఉదయం 9:00 గంటలకు తొలి మ్యాచ్, సాయంత్రం 6:30కు రెండో మ్యాచ్ జరగనుంది. క్యాలిఫోర్నియాలోని పోమోనా నగరంలోని ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదిక కానుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పురుషులు మరియు మహిళల విభాగాల్లో ఆరు జట్లు చొప్పున పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ఎంచుకోనుంది. (Cricket in Olympics 2028)

చివరిసారిగా ఎప్పుడు..?
1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ చివరిసారిగా కనిపించింది. అప్పట్లో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ మాత్రమే తలపడగా, ఈ పోటీలో యూకే విజయం సాధించింది. టెస్ట్, వన్డే లాంటి దీర్ఘకాలిక ఫార్మాట్ల నిర్వహణకు తగిన సమయం లేక, మౌలిక వసతుల లేమి వంటి అంశాల కారణంగా క్రికెట్ ఒలింపిక్స్ నుంచి పక్కకు తప్పించారు. దీంతోపాటు క్రికెట్ కేవలం దక్షిణాసియా దేశాలకే పరిమితమైన క్రీడ అన్న భావన ఉండేది. దీనికి తోడు ఒలింపిక్స్ కమిటీలోనూ క్రికెట్ ప్రతినిధులుకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండటమే ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇప్పుడెందుకీ నిర్ణయం..?
క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా నిర్వాహకులు ఈ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చారు. అమెరికాలో కూడా క్రికెట్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యూఎస్ఏ – వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో మూడు వేదికల్లో మ్యాచులు నిర్వహించారు.

టీ 20 లీగ్‌లతో పాటు భారత్ లో ఐపీఎల్‌తో పాటు మరిన్ని లీగ్‌లు ఈ ఆటకు ప్రాచుర్యాన్ని పెంచాయి. భారీగా ఆదాయాన్నీ తెచ్చి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో, 2023లో ముంబైలో జరిగిన 141వ ఒలింపిక్స్ సమావేశాల్లో, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 125 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ కనిపించనుంది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, లక్రాస్, స్క్వాష్ క్రీడలకూ స్థానం లభించింది.