Cricket: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఇండియా vs ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓర్పుతో డబుల్ సెంచరీ (234) చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో వేగవంతమైన శతకంతో మరోసారి తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. కేవలం 127 బంతుల్లోనే సెంచరీ సాధించి, అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
తొలి భారత ఆటగాడిగా..
ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తం 369 పరుగులు చేయడం ద్వారా టీమిండియా తరఫున ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ గౌరవం వెస్టిండీస్‌పై 344 పరుగులతో సునీల్ గవాస్కర్ పేరిట ఉండగా, ఇప్పుడు గిల్ ఆ రికార్డును అధిగమించాడు. ఇది గిల్ టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన మూడో శతకం కావడం విశేషం.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో పాటు మరో సెంచరీ చేసిన ఆటగాళ్లు కొద్దిమందే ఉన్నారు. భారత తరఫున ఈ అరుదైన ఘనతను సాధించిన రెండో ఆటగాడిగా గిల్ పేరు నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయంగా మాత్రం గిల్ ఇది చేసిన తొమ్మిదవ ఆటగాడు కావడం గమనార్హం.

భారీ ఆధిక్యంలో టీమిండియా..
ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. గిల్‌తో పాటు రిషభ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలు సాధించగా, రవీంద్ర జడేజా 23 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌పై మొత్తం 481 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. టీ విరామం అనంతరం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ టెస్ట్‌లో టీమిండియా విజయానికి ఇప్పుడు ప్రధానంగా బౌలర్ల ప్రదర్శన కీలకమవుతుంది. ఇప్పటికే భారీ ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, చివరి రోజు తమ బౌలర్లపై పూర్తి నమ్మకంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కట్టడి చేయడం ద్వారా ఈ మ్యాచ్‌ను టీమిండియా సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్ ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా అంతా గిల్ ప్రశంసలతో నిండిపోయింది. టీమిండియా యువ కెప్టెన్‌గా గిల్ మొదటి టెస్ట్ సిరీస్‌కే ఇంత అద్భుతంగా రాణించడమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా చాటాడు.