Cinema: సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న “కూలీ” సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపుతోంది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో సౌత్ ఇండియా స్టార్‌లందరూ ఓ చోట కలుసుకోవడం ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన “కూలీ” గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వీడియోలో రజనీకాంత్ మాస్ మేనరిజంలు ఆకట్టుకుంటున్నాయి కానీ, ఇతర నటుల ముఖాలు చూపించకుండా దర్శకుడు ఆసక్తికరంగా మిస్టరీని కొనసాగించడమే విశేషం.
ఇదిలా ఉంటే, “కూలీ” సినిమా విదేశీ పంపిణీ హక్కులు (ఫారిన్ రైట్స్) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సమాచారం ప్రకారం, ఈ మూవీ రైట్స్ కోసం ఓ ప్రముఖ అంతర్జాతీయ పంపిణీ సంస్థ రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర నిర్మాత కళానిధి మారన్ మాత్రం ఇంకా ఎక్కువ మొత్తాన్ని కోరుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ హక్కుల డీల్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఈ డీల్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో ఇంత భారీ ధరకు ఓ చిత్రానికి విదేశీ హక్కులు అమ్మకం జరగడం ఇదే మొదటిసారి కానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి తమిళ చిత్రానికి కూడా ఇలాంటి ధరలు అందలేదని, “కూలీ” ఈ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించబోతోందని చెబుతున్నారు.
రజనీకాంత్ మరియు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో, ఈ సినిమాపై అంతర్జాతీయంగా కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీ ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన “విక్రమ్” చిత్రం సూపర్ హిట్ కావడం, రజనీకాంత్ “జైలర్”తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో “కూలీ” సినిమాపై భారీ మార్కెట్ క్రియేట్ అయ్యింది.
ఈ సినిమాతో రజనీకాంత్ మరోసారి తన మాస్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరో స్థాయికి తీసుకెళ్లనున్నారని అంచనా. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్‌లు సినిమాపై హైప్‌ను పెంచగా, త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో “కూలీ” సినిమా బిజినెస్, కొత్త రికార్డులు, విడుదల ప్రణాళికలపై ఆసక్తికర విషయాలు రాబోయే రోజుల్లో బయటకు రానున్నాయి.