అమరావతి: షెడ్యూల్డ్ కులాల (SC) వ్యక్తులు క్రైస్తవంలోకి (Christian) మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చిచెప్పింది. వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. ఒక చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టింది. తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారంటూ గుంటూరు జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు కోర్టులో పెండింగ్ ఉండగా.. 2022లో నిందితులు కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిర్యాదుదారు గత పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నాడని.. మతం మారిన వ్యక్తి ఎస్సీగా ఎలా చెప్పుకుంటారని హైకోర్టుకు విన్నవించారు.

Supreme Court: సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?
రాజ్యంగ ఆర్డర్ 1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాన్ని స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు (High Court) కేసు కొట్టివేయడంతో పాటు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని మరోమారు స్పష్టం చేసింది. అయితే, తనకు ఎస్సీగా మండల తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం ఇచ్చారంటూ సదరు పాస్టర్ వాదించగా.. అది చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.