
Kaleshwaram: కాళేశ్వరం పుష్కరాలు తనకు ఓ కొత్త పాఠం నేర్పాయని పెద్దపెల్లి కాంగ్రెస్ ఎంపీ (Peddapalli MP) గడ్డం వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నానంటూ ఆవేధన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పుష్కరాల్లో స్థానిక ఎంపీ గడ్డం వంశీ కృష్ణకి ఆహ్వానం అందలేదని దళిత సంఘాలు (Dalit) పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వంశీ.. ఈ పుష్కరాల్లో బేధం స్పష్టంగా కనిపించిందన్నారు. కులాలను ఆధారంగా చేసుకునే నాయకులు ఎలా ప్రవర్తించారో తెలుసుకున్నానన్నారు.

ఈ పుష్కరాల వల్ల తాను బాధపడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ వంశీ. భారత రాజ్యాంగం(Indian Constitution) ప్రకారం కులాలకు సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ దేవాలయాలకు వెళ్లొచ్చని.. ఇది మరొక్కసారి నేను అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నానంటూ స్పష్టం చేశారు. తనకు అండగా నిలిచి, పోరాటం చేసిన దళిత వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. వంశీ మాట్లాడే సమయంలో మంత్రి సీతక్క ఆయన పక్కనే ఉండటం గమనార్హం. అయితే, ఎంపీ వంశీ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదంటూ మండిపడుతున్నారు.