Congress: రాజకీయాల్లో రాణించాలనుకునే మహిళల కలల్ని నిజం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. వచ్చే ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకే కేటాయించే బాధ్యత నాదంటూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆచరణ సాధ్యం కాదేమోనన్న ప్రశ్నలను పటాపంచలు చేస్తూ.. మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు త్వరలో ‘అధినేత్రి’ పేరుతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు.
మహిళలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేలా, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. “మహిళలను సైతం నాయకులుగా తీర్చిదిద్దే సమయం వచ్చింది. చట్టసభల్లో వారికి మరింత ప్రాధాన్యత కల్పించేందుకు ఇది మౌలిక అడుగు” అని ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ అన్నారు.
త్వరలో జరగనున్న ఈ వర్క్‌షాప్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మహేశ్ గౌడ్ వెల్లడించారు. మహిళల అభిప్రాయాలు, రాజకీయ అవగాహన, నాయకత్వ శక్తి, ప్రాజెక్ట్ ప్లానింగ్ వంటి అంశాలపై ఈ శిక్షణ శిబిరంలో నిపుణులు ప్రాక్టికల్ సెషన్లతో కూడిన మార్గదర్శనం అందించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ‘మహిళా గర్జన’, ‘మహిళా మేళా’ లాంటి కార్యక్రమాల ద్వారా వారి పాత్రను విశదీకరిస్తోందని, ఇప్పుడు ‘అధినేత్రి’ వర్క్‌షాప్ ద్వారా మరింత సమగ్రమైన నాయకత్వ శిక్షణను అందించనున్నట్లు టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.

ఇది కేవలం నాయకత్వ శిక్షణ మాత్రమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే దిశగా తీసుకుంటున్న ముందడుగు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆలోచనగా చెబుతోంది.