
Hyderabad: రాజకీయ నేతల ఉచ్చులో పడి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూడొద్దని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. గత కొంత కాలంగా ఆర్టీసీతో పాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మీకు ఎలా ఉండేదో చూడండి.. ఇప్పుడేం మార్పు జరిగిందో మీరే గమనించండి. సమ్మెకు సమరానికి పిలుపునిస్తున్న నేతలకు నేను చెబుతున్నా.. ఎందుకు సమ్మె..? ప్రతీ నెలా ఒకటో తారీఖునే మీ ఖాతాల్లో జీతాలు వేస్తున్నందుకా..? అంటూ ప్రశ్నించారు. కొందరు నాయకులకు ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనో, అస్థిర పరచాలనో ప్రయత్నాలు చేస్తారని.. ఆ ఉచ్చులో మీరు పడొద్దని కోరారు. మీరూ మేము వేర్వేరు కాదని.. మనందరం కలిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

రాష్ట్రంలో పెట్రోల్(Petrol Rate) ధర రూ.200 చేద్దామా..? పప్పులు, నూనెలు ఇతర నిత్యావసరాల ధరలు పెంచుదామా..? అంటూ ఉద్యోగులను ప్రశ్నించిన రేవంత్.. ధరలు పెంచకుండా, సామాన్యులపై అదనపు భారాలు వేయకుండా కొత్తగా నిధులు పుట్టించడం సాధ్యం కాదని చెప్పారు. మీరు చెప్పండి, ప్రజలపై భారం మోసినా మాకు ఈ పనులు చేసిపెట్టండని.. ఓ సభ పెట్టి 10లక్షల మందిని పిలుద్దాం.. అందరి ముందే మీరు రాసిన పేపరే చదువుతానంటూ జేఏసీ నేతలనుద్దేశించి మాట్లాడారు.
ఏం చేస్తారు..? నన్ను కోస్తారా..? నన్ను కోసినా, కోసి వండుకుని తిన్నా రాష్ట్ర బడ్జెట్(Telangana Budget) రూ.18500కోట్లకు మించి లేదన్నారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నామని.. సీఎం హోదాలో స్పెషల్ ఫ్లైట్లో తిరిగే అవకాశం ఉన్నా.. విదేశాలకు వెళ్లేప్పుడూ ఎకానమీ సీట్లలోనే సాధరణ ప్రయాణికులతో కలిసి వెళ్తున్నామని.. ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చులు తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని.. ఇలాంటి సమయాల్లో కలిసి నడవాల్సిన ఉద్యోగులే సమ్మెకు పిలుపునిస్తే ఏం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.