Cinema: నాగ్ vs ధ‌నుష్‌.. కుబేరా హిట్‌పై ఫ్యాన్ వార్‌!

Cinema Nag vs Dhanush Kuberaa

Share this article

Cinema: మావోడు గొప్పంటే.. మావోడే గొప్పంటూ త‌మ అభిమాన‌ హీరోల గురించి సామాజిక మాధ్యమాల్లో అభిమానుల పోట్లాట సాధార‌ణ‌మే. అంత‌ర్జాతీయ చిత్రాల నుంచి షార్ట్ ఫిలింల దాకా ఇదే తంతు. ఇక మ‌ల్టీ స్టార‌ర్ సినిమాల సంగ‌తైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా హిట్ట‌యిన త‌ర్వాత ఆ సినిమా విజ‌యానికి రామ్ చ‌ర‌ణ్ కార‌ణ‌మంటూ ఓ వ‌ర్గం.. జూనియ‌ర్ ఎన్టీఆర్ కార‌ణ‌మంటూ ఓ వ‌ర్గం ఓ చిన్నపాటి యుద్ధ‌మే చేశారు. ఆ వ‌ర్గ‌పోరు ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయితే, ఇప్పుడు ఏకంగా కాస్త స‌రిహ‌ద్దులు దాటి ఓ త‌మిళ హీరో, ఓ తెలుగు హీరో కోసం అభిమానులు కొట్టుకుంటున్నారు.

బాక్సాఫీస్ షేక్‌..
శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడుద‌లైన కుబేరా చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన బెస్ట్ సినిమాగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే, ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళ న‌టుడు ధ‌నుష్‌, తెలుగు సీనియ‌ర్ న‌టుడు అక్కినేని నాగార్జున న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం మొత్తం ఈ ఇద్ద‌రి చుట్టే తిరుగుతుంది. బిక్ష‌గాడి వేషంలో ధనుష్ న‌ట‌ను ప్ర‌త్యేక ఫ్యాన్ బేసే ఏర్ప‌డింది. కుటుంబ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోవ‌డంలో ధ‌నుష్ స‌ఫ‌ల‌మ‌య్యాడు. తొలివారంలోనే దాదాపు రూ.150కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిందీ చిత్రం.

అక్క‌డ మొద‌లైంది..
కుబేరా సినిమా వ‌సూళ్ల‌కు నాగార్జునే కార‌ణ‌మంటూ ఇటీవ‌ల అక్కినేని అభిమానులు పోస్టులు చేయ‌డంతో ఈ వివాదం మొద‌లైంది. దీనికి బ‌దులుగా త‌మిళ సినీ అభిమానులు ధ‌నుష్‌ను వెన‌కేసుకొస్తూ.. ధ‌నుష్ లేక‌పోతే అస‌లు ఈ సినిమానే లేదంటూ ధీటుగా బ‌దులిస్తున్నారు. ఈ గొడ‌వ కాస్త చినికి చినికి గాలివానైంది. నాగార్జున గ‌తంలో ప‌లు వేధిక‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు, స‌మావేశాల్లో వివాదాస్ప‌ద కామెంట్లను ధ‌నుష్ ఫ్యాన్స్ బ‌య‌ట‌కు తీస్తున్నారు. ధనుష్‌ను ఇత‌ర సూప‌ర్‌స్టార్లు పొగిడిన వీడియోల‌ను పోస్ట్ చేస్తూ.. మాతో పోలికే పెట్టుకోవ‌ద్దంటూ హెచ్చ‌రిస్తున్నారు.

దీనికి బ‌దులుగా నాగ్ ఫ్యాన్స్ ధ‌నుష్ త‌ప్పుల‌ను వెతికి ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు. నాగ్ ప్ర‌తీ వేధిక‌పై ధ‌నుష్‌కు గౌర‌వం ఇచ్చాడ‌ని.. దాన్ని ధ‌నుష్ అలుసుగా తీసుకున్నాడ‌ని పోస్ట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ స‌మ‌యం నుంచే మిస్ట‌ర్ డీ ఇన్ సెక్యురిటీతో బాధ‌ప‌డుతున్నాడ‌ని.. ఈ సినిమా హిట్ క్రెడిట్ ఎక్కడ నాగార్జున‌కు ద‌క్కుతుంద‌నో భ‌యంతోనే బ‌తుకుతున్నాడంటూ తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా క‌నిపించ‌ట్లేదు. ఈ ఇద్ద‌రు న‌టులూ ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై స్పందించ‌లేదు. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి మ‌రి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *