Cinema: తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి కాజల్ అగర్వాల్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కాజల్… అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ పరంగా చూస్తే, ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఓ స్టెబిలిటీ సాధించగా, పెళ్లి అనంతర జీవితాన్నీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆమెకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నప్పటికీ, ఆమె గ్లామర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. స్క్రీన్ మీద కాజల్ కనిపించిందంటే ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తిగా చూసేలా చేస్తోంది.
గత ఏడాది ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామలో ఆమె ఒక పోలీస్ అధికారిణిగా నటించి మెప్పించింది. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె “కన్నప్ప” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పార్వతీ దేవిగా కనిపించబోతుంది. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో ఆమె నటించాల్సిన పాత్రకు మొదటగా కంగనా రనౌత్‌ను సంప్రదించినట్టు సమాచారం. కానీ అనివార్య కారణాల వల్ల కంగనా అందుకు ఒప్పుకోలేకపోవడంతో, కాజల్‌కు ఆ అవకాశం లభించింది. గతంలో మంచు విష్ణుతో కలిసి ‘మోసగాళ్ళు’ చిత్రంలో నటించిన అనుబంధంతోనే, ఆయన కోరిక మేరకు కాజల్ ఈ పాత్రకు ఓకే చెప్పిందట. “కన్నప్ప”లో శివుడిగా బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ నటించగా, గతంలో స్పెషల్ 26 అనే హిందీ చిత్రంలో ఆయన సరసన కాజల్ కూడా నటించింది. ఈ నేపథ్యంలో ఈ జంట తెరపై “పార్వతీ–పరమేశ్వరులుగా మెప్పిస్తారని చిత్రబృందం నమ్ముతోంది.

ఇక పెళ్లి తర్వాత.. పలు పాత్రలు దక్కుతున్నా.. హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు కనిపించట్లేదు ఈ ముద్దుగుమ్మకు. దీనికి తోడు తనకు ఎప్పటినుంచో ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్షన్ ఫీల్డ్‌ను ఇప్పుడు ప్రత్యామ్నాయ అవకాశంగా భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తానే హీరోయిన్‌గా నటిస్తూ, తానే డైరెక్ట్ చేసే ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం తనే నటిస్తూ తనే డైరెక్టర్‌గా సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు కంగనా మాదిరిగా తాను కూడా నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలు, పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో కాజల్ బిజీగా ఉంది. అదే సమయంలో ఇండియన్ 3 అనే భారీ చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు ఆమె డైరెక్షన్ పైనే తెలుగు సినీ పరిశ్రమలో చర్చ జోరుగా సాగుతోంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ తరహా ప్రయోగాలు ఒక నటికి కొత్త ఊపిరినిస్తాయని, తను ఏ స్థాయిలో ఉన్నా ఎదుగుదల కోసం పథకాలు వేయడమే నైజమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నటిగా మెప్పించిన కాజల్ అగర్వాల్.. దర్శకురాలిగా ఏమేరకు మెప్పిస్తారో ముందు ముందు చూడాల్సిందే.
కాజల్ అగర్వాల్ 2025 | కాజల్ దర్శకత్వం | కాజల్ కొత్త సినిమా | కాజల్ లేటెస్ట్ న్యూస్ | కాజల్ అగర్వాల్ Kannappa movie, కాజల్ అగర్వాల్ సత్యభామ, కాజల్ కంగనా రనౌత్, Kajal Agarwal Telugu Movie News