UPI: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విప్లవానికి మారుపేరు అయిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) పై ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘ఇకపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారట!’’ అంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న యూపీఐ సేవలకు ఛార్జీలు పెడతారా? అన్న ఆందోళన సామాన్య ప్రజలతోపాటు చిన్న వ్యాపారుల్లోనూ స్పష్టంగా కనిపించింది.
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐపై తాము ఎలాంటి ఛార్జీల ఆలోచనే చేయలేదని స్పష్టం చేసింది. యూపీఐ సేవలు పూర్తి స్థాయిలో ఉచితంగానే కొనసాగనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న MDR (Merchant Discount Rate) వార్తలు పూర్తిగా అసత్యమని ఖండించింది. ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలను అమలు చేయబోతోందని తేల్చిచెప్పడంతో వినియోగదారుల్లో ఆందోళన తగ్గింది.

ఈ రూమర్ ఎలా మొదలైంది?
ఇటీవల కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు MDR అనే అంశాన్ని ప్రస్తావించాయి. దానికి తోడు కొన్ని న్యూస్ పోర్టల్స్ ఈ అంశాన్ని ఊపందిస్తూ వ్యాపారులు యూపీఐ ద్వారా డబ్బులు స్వీకరించే సమయంలో ఛార్జీలు విధించే అవకాశం ఉందని కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు సామాన్య ప్రజల మధ్య అసత్య గాసిప్లను ప్రోత్సహించాయి.
అసలే డిజిటల్ పేమెంట్లు నిత్యజీవితంలో ఒక భాగంగా మారిన ఈ రోజుల్లో, యూపీఐపై ఉన్న నమ్మకానికి పోగెట్టేలా ఈ రూమర్లు మారాయి. అందుకే కేంద్రం స్పందిస్తూ యూపీఐ సేవలు వినియోగదారులకు పూర్తిగా ఉచితమేనని స్పష్టం చేసింది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటనగా మారింది.
MDR అంటే ఏమిటి?
యూపీఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా వ్యాపారులు డబ్బులు స్వీకరించినప్పుడు, బ్యాంకులు లేదా పేమెంట్ గేట్‌వేలు వారు వసూలు చేసే పర్సంటేజి మొత్తం. ప్రస్తుతం యూపీఐపై ఈ MDR ఛార్జీలు ప్రస్తుతానికి వర్తించవు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైన ప్రకటన చేసింది.
ఇటీవల UPI వృద్ధి కూడా గణనీయంగా నమోదైంది. 2024–25లో నెలకు సగటున 15 నుండి 18 బిలియన్ లావాదేవీలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 40 శాతం వృద్ధిని సూచిస్తోంది. పెద్ద నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల దాకా చిన్నచిన్న వ్యాపారులు, బడ్డీ కొట్లు సైతం యూపీఐ వాడకాన్ని స్వీకరించటం ఇప్పుడు సాధారణంగా మారింది.
మరింత సులువుగా..!
ఇక UPIను మరింత వినియోగదారులకు సులభంగా మార్చే దిశగా ప్రభుత్వం పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. UPI Lite ద్వారా చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్లను బ్యాంక్ కనెక్షన్ లేకుండానే చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా యూపీఐ సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్, యూఏఈ, నేపాల్ వంటి దేశాల్లో ప్రారంభమై, త్వరలో మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది. మరింత అద్భుతంగా, గొంతు ఆధారిత పేమెంట్ విధానం ‘UPI Voice Pay’ అనే టెక్నాలజీ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.
యూపీఐ వినియోగదారులకు భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం తేల్చి చెప్పిన ప్రకారం, యూపీఐ లావాదేవీలు ముందు మాదిరిగానే ఉచితంగా కొనసాగుతాయి. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మకుండా, అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఇక ప్రజలు, చిన్న వ్యాపారులు ఎలాంటి సందేహం లేకుండా యూపీఐ సేవలను కొనసాగించవచ్చు.