Char Dham: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలోనూ పైలట్‌తో సహా ప్రయాణీకులు అంతా చనిపోవడం మరోసారి కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ (Uttarakhand)లో హెలికాఫ్టర్ (Helicopter) కుప్పకూలింది (Crash). ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
ప్రమాదం గుర్తించే సమయానికి ఐదుగురి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఛార్‌దామ్ యాత్రలో భాగంగా గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మద్య ఆర్యన్ కంపెనీకి చెందిన హెలీకాఫ్టర్ ఈ ప్రమాదానికి గురైంది. అయితే ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆదివారం తెల్లవారు జామున 5:20 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కేదార్‌నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి బయలుదేరింది. గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది. పైలెట్ సహా ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందినవారుగా గుర్తించారు. ప్రమాదఘటన తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

హెలికాఫ్టర్లు బంద్!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హెలికాఫ్టర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలె ఛార్‌దామ్ యాత్రకు వచ్చిన భక్తులతో బయలుదేరిన ఓ హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యలతో రోడ్డుపై ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్ దెబ్బతినగా.. ఎవరికీ ఏం కాలేదు. ఇప్పుడు మరోసారి ఈరోజు జరిగిన ప్రమాదంలో అందరూ చనిపోయారు. దీంతో వరస హెలికాఫ్టర్ల ప్రమాదాలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మండిపడ్డారు. హెలికాఫ్టర్ సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ల సాంకేతికత పరిస్థితులతో పాటు భద్రతా లోపాలు ప్రతీరోజూ తనిఖీ చేయాలన్నారు. అయితే, ఇకపై ఉత్తరాఖండ్‌లో హెలికాఫ్టర్ల సర్వీసులు బంద్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం తదుపరి ఆర్డర్లు ఇచ్చేవరకూ హెలికాఫ్టర్లు ఎగరకూడదని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక, భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.