ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu) వారసుడిగా రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు నారా లోకేష్. 2014 ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్(Nara Lokesh).. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపించి మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల తర్వాతి స్థానంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపడతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి తోడు ఆయన సీఎం అవుతారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. పలు సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇండియా టుడే రాజ్‌దీప్ సర్దేశాయ్(Rajdeep Sardesai) తో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. లోకేష్ భవిష్యత్తు లీడర్ అంశంపై స్పందించారు. మొన్నటి మహానాడులోనే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు.. కానీ ప్రకటించలేదు.. దీనికి మీ పార్టీలో ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా..? 2029 ఎన్నికలకు లోకేష్‌ను సీఎంగా పరిచయం చేయబోతున్నారా..? అంటూ రాజ్‌దీప్ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు చంద్రబాబు.
ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రంలోనూ తండ్రి తర్వాత కొడుకులు నేరుగా సీఎం అవ్వలేరన్నారు. దానికి జనం ఒప్పుకోవాలని.. వారు మ్యాండేట్ ఇస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. తర్వాతి వారసుడన్న ప్రశ్నకు స్పందిస్తూ.. మా పార్టీలో లోకేష్‌కు పూర్తి మద్దతు ఉంది. దీంతో పాటు మేం యువతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
పార్లమెంట్‌లో యంగెస్ట్ ఎంపీలు ఉన్న పార్టీ టీడీపీ అన్నారు. కేంద్ర కేబినేట్‌లో పిన్న వయస్కుడైన మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారని.. ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ యువకులు శాసనసభ్యులగా ఉన్న రాష్ట్రమని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోమారు రాజ్‌దీప్ లోకేష్ సీఎం అనే ప్రశ్న వేయగా.. దానికి సమయముందని.. ఇప్పుడే ఏం చెప్పలేనని చంద్రబాబు స్పష్టం చేస్తూ వచ్చారు. దీంతో త్వరలో లోకేష్‌ను సీఎం చేస్తారన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్టయింది. మరో టీడీపీ నేత స్పందిస్తూ.. కూటమిలో ఉన్న జనసేన పార్టీని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం చేస్తోందన్నారు. ప్రస్తుతానికి పార్టీలో అధ్యక్ష మార్పిడీ, సీఎం సీటు గురించి చర్చే లేదని చెప్పారాయన.
Andhrapradesh, Latest News, Chandrababu Naidu, AP CM, Deputy CM