
Hyderabad: తెలంగాణా భవన్(Telangana Bhavan)లో బీఆర్ఎస్(BRS) మహిళా నేతలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy), ఎమ్మెల్సీ సురభి వాణీదేవి(Surabhi Vani Devi), కార్పొరేటర్ సామల హేమ ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్సి కవిత కామెంట్స్ తర్వాత ఆ పార్టీ మహిళా నేతల నుంచి ప్రెస్ మీట్ పిలుపు రావడంతో అంతా అదే అంశంపై మాట్లాడతారనుకున్నారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడారు.
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో 6052 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో ఐఐటీ(IIT), ఎంబీబీఎస్(MBBS), ఐఐఎం(IIM)లలో ర్యాంకులు సాధించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిన్న జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ అసలు గురుకులాల గురించి ఏమీ చేయలేదని అబద్ధాలు మాట్లాడారని.. కేసీఆర్ గురుకులాల ద్వారా విజయాలు సాధించిన విద్యార్థులే నిన్న రేవంత్ కార్యక్రమంలో ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో ఓ క్రమ పద్దతిలో చేసిన ప్రయత్నాల వల్లే గురుకులాలు మంచి ఫలితాలు సాధించాయని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తమ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్టియల్ స్కూళ్లను ఓ పార్టీ వ్యతిరేకిస్తుందని విమర్శించారని.. బీఆర్ఎస్ ఎప్పుడూ ఆ పని చేయదన్నారు. మీవి మాటలే తప్ప చేతల్లేవని దుయ్యబట్టారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై అసెంబ్లీలో ప్రశ్న అడిగితే సమాధానం లేదన్న సబితా ఇంద్రారెడ్డి.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2వేల ప్రభుత్వ బడులను మూసి వేశారన్నారు. విద్యా కమిషన్ వేసి ఏడాది అవుతుంది. ఏ ఘనత సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. అనంతరం సురభి వాణీ దేవి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువేనన్నారు. బడుల్లో వసతుల కల్పన, టీచర్ల భర్తీపై దృష్టి పెట్టాలని.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రభుత్వ అంచనాలు చూస్తుంటే భయమేస్తుందని తెలిపారు. ఈ బడులపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలని.. ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాలని వాణీ దేవి డిమాండ్ చేశారు.