Breaking: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్(Telangana Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పంచాయతీ రాజ్ చట్ట సవరణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశాల్లోనే ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో రాష్ట్ర సర్కారు ఈ ఎన్నికల్లోనే బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేపట్టి.. బీసీలకు 42శాతం కల్పించే బిల్లును తీసుకురానున్నారు. ఇది జరిగితే జనరల్ స్థానాలూ కలుపుకొని రాష్ట్రంలోని 60శాతం స్థానాల్లో బీసీలే సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలు దక్కించుకోనున్నారు.
తెలంగాణలో బీసీ ఓట్లే కీలకం. గత ఎన్నికల్లోనూ బీజేపీ బీసీ సీఎం నినాదంతో బరిలోకి దిగింది. కాంగ్రెస్ సైతం బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి తామూ బీసీల వైపేనని చెప్పే ప్రయత్నం చేసింది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతో గట్టి ప్రభావం చూపించనుంది. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ ఎన్నికలతో పాటు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపైన ఈ కేబినెట్‌లో చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అమలుపైనా చర్చించారు.