
India-Pakistan: కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:45గంటలకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని 9 ప్రాంతాలపై భారత వైమానిక దళం(Indian Air Force) మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ కు అత్యంత కీలకంగా భావించే ముజఫరాబాద్(Muzafarabad), కోట్లి, బహవల్పూర్(Bahawalupur), మురిడ్కే ప్రాంతాలను టార్గెట్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధునాతన యుద్ధ విమానాలతో విధ్వంసం సృష్టించింది. భారత్‌పై కుట్ర పన్నినట్టు భావిస్తున్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ దాడిలో పెద్ద ఎత్తున ఉగ్రమూకలు మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం ప్రకటన ఇచ్చిన కొద్ది సేపటికే భారత ఆర్మీ.. న్యాయం జరిగింది అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. నువ్వెక్కడున్నా పట్టుకుంటా.. నిన్ను తప్పక వెంటాడుతా అంటూ సాగే ఓ డైలాగ్ వీడియోను జోడించింది. పాక్ మిలిటరీ జోలికి వెళ్లలేదని.. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసినట్లు స్పష్టం చేసింది.
అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్ డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందించారు. భారత వైమానిక దళాలు తమ దేశంలో దాడులు చేసినట్లు ధ్రువీకరించారు. ఇందులో కేవలం ముగ్గురు చనిపోయారని.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని ప్రకటన చేశారు. అయితే, ఎంతమంది చనిపోయారన్న దానిపై భారత సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతం లష్కరే తోయిబా హెడ్ క్వార్డర్స్ కాగా.. ముందురోజు దాదాపు 200 మందికి పైగా ఈ ప్రాంతంలో ఉన్నారని అక్కడి మీడియా చెబుతోంది. మరో ప్రాంతం పంజాబ్ ప్రావిన్సులోని బవల్పూర్ జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరం. ఇక్కడ కూడా వందకు పైగా టెర్రరిస్టులు ఆ సమయానికి ఉండి ఉండవచ్చని అంచనా.
ముష్కరుల మీద జరిగిన ఈ దాడిని తమ దేశపు పౌరులుగా చిత్రీకరించి దీన్ని యుద్ధంగా పాకిస్థాన్ ప్రచారం చేయవచ్చని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అయితే రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఉండగా.. ఈరోజు రాత్రే ఈ దాడి జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.