ప్రధాన సూత్రదారి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యరావు కోసం పోలీసులు గాలింపు
Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం కేంద్రంగా ఓ భారీ కుంభకోణం జరిగింది. అంబేడ్కర్ ఆశయ సాధన పేరిట సొసైటీ ఏర్పాటు చేసిన ఓ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఏకంగా రూ.100కోట్లకు పైగా నిధులు సమీకరించి బోర్డు తిప్పేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులే లక్ష్యంగా ఈ కుంభకోణం తెరలేవడం గమనార్హం.
విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యరావు కొద్దిరోజుల క్రితం అంబేడ్కర్ ఆశయ సాధన పేరుతో ఓ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా దళిత సంఘాలు, ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మ్యాక్స్ సంస్థ పేరిట చిట్స్, సేవింగ్స్ అంటూ దాదాపు 2500 మంది నుంచి సుమారు రూ.100కోట్లు డిపాజిట్లుగా సేకరించినట్లు సమాచారం. ఇందులో చేరిన ప్రతీ ఒక్కరికీ 12శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలకడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దళిత ఉద్యోగులు, మైనారిటీ నేతలు ఇందులో పెట్టుబడి పెట్టారు. అయితే, కొద్దిరోజుల క్రితం ఈ మ్యాక్స్ సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మ్యాక్స్ సంస్థ డైరెక్టర్, కీలక ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

మీడియా పేరు వాడుకొని..
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన స్నేహ టీవీ, జై భీం టీవీతో పాటు ప్రజాపాలన దినపత్రికల్లోనూ శివభాగ్యరావు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. వీటితో పాటు మరో ఐదుకు పైగా యూట్యూబ్ ఛానళ్లు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుతం స్నేహ టీవీ ఛైర్మన్‌గా అందరికీ ఆయన సుపరిచితుడు. ఈ మీడియా సంస్థలను వాడుకొని దళిత సంఘాలు, అధికార పార్టీలో కీలక నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం జరిగనట్లు తెలుస్తోంది. పోలీసులు వీటిపైనా విచారణ జరుపుతున్నారు. శివభాగ్యరావు గత ఎన్నికల్లో గుంటూరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.
