BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచంద‌ర్ రావు!

BJP MLC Ramchander Rao as president

Share this article

BJP: తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా అనూహ్య ఎంపిక జ‌రిగింది. మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావును రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ జాతీయ నాయ‌కత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం. తొలుత ఈ అధ్య‌క్ష తుది రేసులో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంధ‌ర్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈరోజు ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు ఆస‌క్తి ఉన్న నేత‌లు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు రాం చంద‌ర్ రావు పేరు తెర‌పైకి వ‌చ్చింది. మిగ‌తా నేత‌ల నామినేష‌న్లు దాదాపు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. రాంచంద‌ర్ రావును జాతీయ నాయ‌క‌త్వం ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్లు స‌మాచారం.

BJP Telangana New president Ram chander rao

బ‌ల‌ప‌డేందుకు ఇదే అవ‌కాశం..
తెలంగాణ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప‌దేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ఇప్ప‌టికే ప్ర‌స్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన అవినీతి, రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌, ఫార్ములా ఈ కార్ రేస్ త‌దిత‌ర కేసులతో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున‌పెడ‌తోంది. మాజీ మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఓవైపు, ఇంటి పోరుతో రోడ్డుకెక్కిన ఎమ్మెల్సీ క‌విత ఓవైపు, ఓట‌మి త‌ర్వాత ఫామ్ హౌజ్‌కే ప‌రిమిత‌మైన మాజీ సీఎం కేసీఆర్ తీరు మ‌రోవైపుతో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మెల్లిమెల్లిగా త‌గ్గుతూ వ‌స్తోంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 8 అసెంబ్లీ స్థానాల‌ గెలుపుతో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి ఇదే మంచి అవ‌కాశ‌మంటున్నారు నిపుణులు.

ఎవ‌రీ రాంచంద్ర రావు..?

రామ్‌చంద‌ర్ రావు 27 ఏప్రిల్ 1959న హైద‌రాబాద్‌లో జ‌న్మించారు. కేంద్రీయ విద్యాల‌యం పికెట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. రాజ‌కీయ శాస్త్రంలో బీఏ చేసిన ఆయ‌న 1980లో రైల్వే డిగ్రీ కాలేజీ నుంచి ఏబీవీపీ స్టూడెంట్ లీడ‌ర్‌గా ప్ర‌స్థానం మొద‌లుపెట్టారు. వ‌ర‌స‌గా మూడుసార్లు అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ రాజ‌కీయ‌శాస్త్రం ప‌ట్టా పొందారు. యూనివ‌ర్సిటీ రెండో స్థానంలో నిలిచారు. ఇదే యూనివ‌ర్సిటీ నుంచి LLB పూర్తి చేసిన రాంచంద‌ర్ రావు.. హైకోర్టులో న్యాయ‌వాదిగా సేవ‌లందిస్తున్నారు.

రాజ‌కీయ ప్ర‌వేశం..
1977–80 ABVP Railway Degree College యూనియన్ అధ్యక్షుడిగా, 1982–85 Osmania Law College యూనియన్ కార్యదర్శిగా ప‌నిచేశారు. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే వివిధ స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ దాదాపు 14 సార్లు జైలుకెళ్లారు. BJP‑లో ఫుల్‑టైమ్ రాజకీయ జీవితం ప్రారంభమ‌య్యాక‌.. యూత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, AP BJP న్యాయ సెల్ కో-కన్వీనర్ తో పాటు ప్ర‌చార క‌మిటీల్లోనూ కీల‌క బాధ్య‌త‌ల్లో ప‌నిచేశారు. 2012లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప‌నిచేశారు. న్యాయ‌వాదిగా, ర‌చ‌యిత‌గా, వ‌క్త‌గా ఆయ‌న‌కు మంచి పేరుంది. తన వాదనలు, డిబేట్ల ఆధారంగా పుస్తకాలు ప్ర‌చురించారు.

ప‌ద‌వులు.. ప్ర‌త్యక్ష ఎన్నిక‌లు..
2009లో ప‌ట్ట‌భ‌ద్రుల MLC గా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మ‌ల్కాజ్‌గిరి అసెంబ్లీ సీటుకు బీజేపీ అభ్య‌ర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2015లో Hyderabad‑Ranga Reddy‑Mahabubnagar Graduates నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీగా పోటీచేసి గెలిచారు. 2021లో సుర‌భి వాణీదేవి చేతిలో ఎమ్మెల్సీగా ఓడిపోయారు.

కుటుంబ నేప‌థ్యం..
తండ్రి ప్రొఫెస‌ర్ NVRLN Rao.. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్. ఆయ‌న భార్య శృతి మ‌ర‌ణించారు. ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఓ కుమారుడు న్యాయ‌వాదిగా, మ‌రో కుమార్తె ఆస్ట్రేలియాలో ఉన్నారు.

విద్యార్థి నాయ‌కుడి నుంచి పార్టీలో వివిధ స్థానాల్లో ఆయ‌న ప‌నిచేస్తూ వ‌చ్చారు. క‌ట్ట‌ర్ బీజేపీ నాయ‌కుడిగా, ఆర్ఎస్ఎస్ మ‌ద్ద‌తుదారుగా మంచి గుర్తింపు ఉంది. ఏళ్లుగా ఆయ‌న పార్టీకి చేస్తున్న సేవ‌ల దృష్ట్యా ఆయ‌న్ను పార్టీ నూత‌న అధ్య‌క్షుడిగా జాతీయ నాయ‌క‌త్వం ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బీజేపీ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు ఇదే అవ‌కాశం. ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవడంలో రాంచంద‌ర్ రావు నాయ‌క‌త్వం ఏమేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి మ‌రి.

BJP Telangana President Ramchander Rao
Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *