BJP: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన వ్యవహారం ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ సస్పెన్స్‌కు జూలై 1తో తెరపడనుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పేరు జూలై 1న అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పలు పేర్లు పరిశీలనలో ఉన్నా, తుది రేసులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind), మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Eetala Rajender) మాత్రమే మిగిలినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర విభాగంలో కీలక నేతలైన డీకే అరుణ(DK Aruna), రఘనందన్ రావు,(Raghunandan Rao) రామచంద్రరావు, బండి సంజయ్(Bandi Sanjay) వంటి నేతల పేర్లు మొదట వినిపించినప్పటికీ, జాతీయ నేతలు ఈ ఇద్దరు ఎంపీల పేర్లను మాత్రమే తుది పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జూలై 1న పేరు ఖరారు..
ఈ నెల 29న అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 30న ఈ ఇద్దరు నేతల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ దాఖలైన తర్వాత జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియకు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ రిటర్నింగ్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర నాయకత్వం తరఫున శోభా కరంద్లాజే పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు.

ఏం చూస్తున్నారు..?
పార్టీకి కొత్త నేతను ఎంపిక చేయడంలో జాతీయ నాయకత్వం కొన్ని ప్రధాన ప్రమాణాలను తీసుకుంటోంది. ముఖ్యంగా.. 2024 ఎన్నికల్లో పార్టీలో ప్రదర్శన, నియోజకవర్గంలో పట్టుదల, సామాజిక సమీకరణలు, బలమైన బీసీ రిప్రజెంటేషన్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ధర్మపురి అర్వింద్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభానికి ముఖ్య అతిథిగా రావడం.. అర్వింద్ సైతం దిల్లీ నేతలతో మంతనాలు చేయడంతో ఈ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ఇక ఈటల రాజేందర్‌కు మాత్రం టీఆర్ఎస్ నుంచి వచ్చి పార్టీకి మంచి బలం తెచ్చిన నాయకుడిగా పేరుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక గెలవడం, మల్కాజిగిరి నుంచి ఎంపీగా విజయం సాధించడంలో పార్టీకి చేసిన సేవలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఆయన తన గత అనుభవం, రాష్ట్ర రాజకీయాలపై ఉన్న పట్టు ఆధారంగా ఈ పదవిని ఆశిస్తున్నారు.
పార్టీ వర్గాల అంచనాల ప్రకారం.. ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తే, ఒక్కరోజులోనే ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇద్దరూ నామినేషన్ దాఖలు చేస్తే, వివిధ పారామితుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో జూలై 1న తెలంగాణ బీజేపీకి కొత్త నాయకుడిని ప్రకటించబోతుండటంతో, రాష్ట్రంలో పార్టీలో కొత్త శకానికి నాంది పలికినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందున్న జీహెచ్‌ఎంసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీజేపీకి ఇది అత్యంత కీలకమైన నాయకత్వ మార్పుగా భావించబడుతోంది.
బలపడేందుకు ఇదే అవకాశం..
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ తదితర కేసులతో బీఆర్ఎస్ పార్టీని ఇరుకునపెడతోంది. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు ఓవైపు, ఇంటి పోరుతో రోడ్డుకెక్కిన ఎమ్మెల్సీ కవిత ఓవైపు, ఓటమి తర్వాత ఫామ్ హౌజ్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ తీరు మరోవైపుతో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల గెలుపుతో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి ఇదే మంచి అవకాశమంటున్నారు నిపుణులు.
దూకుడా..? అనుభవమా..?
గతంలో బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త జోష్ వచ్చింది. యువతలో ఊపుతో గ్రామస్థాయిలోనూ బలపడింది. తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ సైలెంట్ అయ్యిందనే వాదన ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు మరోసారి పార్టీని బలపరిచేందుకు, దూకుడుగా ముందుకెళ్లేందుకు అర్వింద్ సరైన ఎంపికని ఎక్కువస్థాయిలో బీజేపీ యువ నేతల నుంచి వినతులు వస్తున్నట్లు అంతర్గత సమాచారం. మరోవైపు అర్వింద్ కు రాష్ట్ర నాయకత్వం, కీలక నేతల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం కలిసి వచ్చే అంశం కానుంది.
అయితే, బలమైన ముదిరాజ్ సామాజికవర్గం నుంచి వచ్చిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన ఈటలకు ఉన్న అనుభవం పార్టీకి కలిసొస్తుందని.. అర్వింద్ దూకుడు పార్టీకి అన్నివేళలా కలిసి రాదని మరో వర్గం చెబుతోందట. మరోవైపు పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. కానీ, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చే సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈసారి ఈటలకే అధ్యక్ష పదవి దక్కే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక బీజేపీకి పునఃస్థాపన అవసరమనే వాదన నేపథ్యంలో, ఈసారి అధ్యక్షుడిగా పవర్ ఫుల్ నేతనే ఎంపిక చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో ఎవరు ఎంపికవుతారు? ధర్మపురి అర్వింద్‌నా? లేక ఈటల రాజేందర్‌నా? అన్నది రేపటి దాకా ఎదురుచూడాల్సిందే.