BJP: జ‌గిత్యాల బీజేపీ అధ్యక్షుడిపై కార్య‌క‌ర్త‌ల‌ దాడి

Share this article

BJP: భార‌తీయ జ‌న‌తా పార్టీ జ‌గిత్యాల జిల్లా శాఖ అధ్య‌క్షుడు రాచ‌కొండ యాద‌గిరి బాబుపై అదే పార్టీకి చెందిన కౌన్సిల‌ర్లు, కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్‌ ఎన్నిక‌ల్లో రాష్ట్రమంతా ఒక తీర్పు ఇస్తే.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ జిల్లాల్లో ఓట‌ర్లు క‌మ‌లం వైపు చూశారు. దీంతో నిజామాబాద్ మేయ‌ర్ పీఠం తృటిలో కోల్పోయినా.. క‌రీంన‌గ‌ర్ పీఠాన్ని చేజిక్కించుకుంది భాజ‌పా(BJP). జ‌గిత్యాల జిల్లాలోనూ రాయిక‌ల్‌, మెట్‌ప‌ల్లి, కోరుట్ల స్థానాలు భాజపా(BJP) చేజారాయి. అయితే, మెట్‌ప‌ల్లిలో భాజ‌పా(BJP) అత్య‌ధికంగా 10 వార్డులు గెలుచుకుంది. భాజ‌పా(BJP) బ‌లానికి మున్సిప‌ల్ ఛైర్మ‌న్ పీఠం ద‌క్కుతుంద‌నుకున్నారంతా.. కానీ అనూహ్యంగా ఇదే పార్టీ నుంచి గెలిచిన చ‌ర్ల‌ప‌ల్లి మీనా సుఖేంధ‌ర్ గౌడ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారు. ఇక్క‌డి 26 వార్డుల్లో 10 భాజ‌పా, 6 కాంగ్రెస్‌, 6 భారాస‌, 4 స్వతంత్రులు ద‌క్కించుకున్నారు.

న‌లుగురు ఇండిపెండెంట్ విజేత‌లు అధికార పార్టీలో చేర‌గా.. భాజ‌పా, కాంగ్రెస్ బ‌లం స‌మాన‌మైంది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు అవ‌స‌రం కాగా.. భాజ‌పా కు చెందిన కౌన్సిల‌ర్ చెయ్యెత్తారు. దీంతో భాజ‌పా(BJP) పీఠాన్ని కోల్పోయింది. అయితే, దీనికి జిల్లా అధ్య‌క్షుడు మెట్‌ప‌ల్లికే చెందిన రాచ‌కొండ యాద‌గిరి బాబు కార‌ణ‌మ‌ని స్థానిక నేత‌లు ఆరోపిస్తూ ఆయ‌న ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లో ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేశారు. ఆదివారం ఉద‌యం 11గంట‌ల లోపు ఇవ్వాల్సిన పార్టీ విప్‌ను… కావాల‌నే సాయంత్రం 5గంట‌ల‌కు ఇచ్చార‌ని. కాంగ్రెస్ నుంచి డ‌బ్బులు తీసుకునే విప్ ఆలస్యం చేశారంటూ ఆగ్ర‌హంతో దాడులు చేశారు. అదే స‌మ‌యానికి ఆయ‌న అక్క‌డికి చేరుకోగా.. ఆయ‌న‌పైనా దాడికి పాల్ప‌డ్డారు. ఆయ‌న త‌ప్పించుకుని పారిపోయే ప్ర‌య‌త్నం చేసినా వెంట‌ప‌డి దాడి చేశారు.

ఈ ఘటనపై యాదగిరి బాబు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గెలిచే అవ‌కాశ‌మున్నా.. ఓడిస్తున్నారు!

నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో భాజ‌పా(BJP) బ‌లోపేతానికి ఎంపీ అర్వింద్ నేతృత్వంలో పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ, జ‌గిత్యాల జిల్లా కార్య‌వ‌ర్గంలో కోట‌రీల ఏర్పాటు, కొంద‌రు నేత‌లు అధికార పార్టీ నేత‌ల‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవ‌డం పార్టీని ఎద‌గ‌నివ్వ‌ట్లేద‌ని కార్య‌క‌ర్త‌ల ఆరోప‌ణ‌. అస‌లైన కార్య‌క‌ర్త‌ల‌ను ప‌క్క‌న పెట్టి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొంద‌రికే ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. కేడ‌ర్ ప‌టిష్టంగా, హిందుత్వ సిద్ధాంతం బ‌లంగా ఉన్నా.. ధ‌ర్మ‌పురి, జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ స్థానిక నేత‌ల నిర్ల‌క్ష్యం, స్వార్థంతో పార్టీ వెన‌క‌బ‌డుతోంద‌నేది బ‌లంగా వినిపిస్తోన్న వాద‌న‌. ప్ర‌స్తుత అంశంతో జిల్లా అధ్యక్షుడిని త‌ప్పించాల‌ని కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేస్తుండ‌గా.. ఇప్ప‌టికే మెట్‌ప‌ల్లి లో క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డిన కౌన్సిల‌ర్ మీన‌, ఆమె భ‌ర్త సుఖేంధ‌ర్ గౌడ్‌ల‌ను పార్టీ స‌స్పెండ్ చేసింది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *