
Tamilanadu: ఇంకా ఏడాది ఉండగానే.. తమిళ నాట ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ శరవేగంగా పావులు కదుపుతున్నాయి.. ఎత్తుకు పైఎత్తులేస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకునేందుకు స్టాలిన్(MK Stalin) నేతృత్వంలోని అధికార డీఎంకే(DMK), ఎలాగైనా గద్దెనెక్కి పార్టీని కాపాడుకోవాలన్న కసిలో అన్నాడీఎంకే(AIDMK), ఎంత తగ్గయినా సరే స్టాలిన్ పై నెగ్గాలని బీజేపీ(BJP), అడుగు పెడుతూనే తమ హవా చూపేందుకు దళపతి విజయ్(Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం.. ఇలా ఎవరికి వాళ్లు వ్యూహాలు రచిస్తున్నారు. 1998 తర్వాత మళ్లీ ఇప్పుడే తమిళనాట ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలకంగా మారనున్నారు..? స్టాలిన్‌పైకి పవన్ ను ఎక్కుపెడుతున్న బీజేపీ ప్రణాళిక.. దళపతి విజయ్ పాత్ర.. తమిళ రాజకీయ క్షేత్ర ప్రస్తుత పరిస్థితులపై ఓజీ సమగ్ర విశ్లేషణ.
సాధారణంగా రాజకీయ పార్టీలు వచ్చే ఐదేళ్ల కోసం ఆలోచిస్తే.. బీజేపీ మాత్రమే తదుపరి పది, పదిహేనేళ్ల ముందుచూపుతో కార్యచరణ రూపొందించుకుంటుంది. అదే ఇప్పుడు ఆ పార్టీని దేశంలో తిరుగులేని శక్తిగా నిలబెడుతోంది. ఈ ప్రణాళికను గెలిపించేందుకు ఆర్ఎస్ఎస్ చేసే గ్రౌండ్ వర్క్ ఊహాతీతం. ప్రాంతాన్ని ఎంచుకోవడం.. అక్కడ క్షేత్రస్థాయిలో అంతా చక్కబెట్టి సైలెంట్‌గా పక్కకు తప్పుకోవడం స్వయం సేవకుల పని. 19 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారం దక్కడానికి ఇదే కీలకంగా నిలిచింది. ఇప్పుడు టార్గెట్ సౌత్. అందులో భాగంగానే కేరళ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి బీజేపీ, ఆరెస్సెస్ లు. తమిళనాడులో కూటమి గెలుపు ప్రభావం మిగిలిన రాష్ట్రాలపై పడనుంది.

నెగ్గేందుకు తగ్గింది!
రాజభాష హిందీ అమలు నుంచి, హిందుత్వ సిద్ధాంతం, పలు కీలక అంశాల్లో రాష్ట్రాల మద్దతు దాకా ప్రతీ నిర్ణయంలో కేంద్రానికి మేకులా తయారయ్యారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్. బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చేయడానికి స్టాలిన్ చేయని ప్రయత్నం లేదు. ఈసారి ఆయన్ని ఎలాగైనా గద్దె దించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. ఇక్కడ మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఆధ్వర్యంలో పార్టీ ఐదేళ్లలోనే ఊహించనంత పుంజుకుంది. కానీ, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. ఇప్పుడు అసెంబ్లీకి సమయం తక్కువగా ఉండటంతో పాటు ఈ బలం చాలదని భావించిన బీజేపీ.. ఏఐడీఎంకేకు బేషరతుగా మద్దతు ప్రకటించింది.
ఇప్పటి పొత్తు కాదిది..!
1998లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, బీజేపీ కూటమితో ఎన్నికల్లో గెలిచారు. అయితే, తర్వాతి సంవత్సరమే వాజ్‌పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది అన్నాడీఎంకే. 2004 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. అన్నాడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటూ దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత మరణం తర్వాత.. ఏఐడీఎంకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా 75 సీట్లకే పరిమితమైంది. 2023లో విడిపోయిన ఈ రెండూ 2024 లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగా పోటీచేసి ఒక్క సీటూ గెలవలేకపోయియి. డీఎంకేకు 39 సీట్లు దక్కాయి.
అన్నామలై రాజ్యసభకు.. పళనికి పీఠం!
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు పావులు కదుపుతోంది బీజేపీ అధినాయకత్వం. తమిళనాట డీఎంకే రేపిన భాష చిచ్చుతో బీజేపీని జనం ఆమోదించరన్న ఆలోచనతో.. స్థానిక పార్టీ అయిన అన్నాడీఎంకేను ముందు పెట్టి నడిచేందుకు సిద్ధమైంది కమలదళం. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళని స్వామిని ఇప్పటికే ప్రకటించింది. ఈమేరకు బీజేపీ పొత్తును ఆమోదిస్తూ అన్నా డీఎంకే కార్యవర్గం సైతం తీర్మానం చేసింది. పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తీర్మానించింది. దీంతోపాటు డీఎంకేను వ్యతిరేకించే పార్టీలు తమ కూటమిలోకి ఆహ్వానించింది.

విజయ్.. చీల్చేందుకేనా..?
ఓట్లను చీల్చేందుకు కొత్త పావుల్ని, పార్టీలను వాడుకోవడం, ఓటర్లను మళ్లించడం రాజకీయాల్లో కొత్తేమి కాదు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో జగన్‌ను దెబ్బకొట్టేందుకు షర్మిళను ఇలానే వినియోగించారనే ప్రచారముంది. అయితే, రెండు బలమైన శక్తుల మధ్య పోరులో మూడో పార్టీ చూపే ప్రభావం 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన, 2024 ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ చూపించాయి. చాలాచోట్ల ఓట్లను పెద్ద ఎత్తున చీల్చి అధికార మార్పిడీలో కీలకమయ్యాయి. అయితే, ఇదే వ్యూహంలో భాగంగా తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్‌ని బీజేపీ పావుగా వాడుకోనుందనే వాదనలూ తోసిపుచ్చలేనివి. విజయ్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఏఐడీఎంకే రెండో స్థానంలో బలంగానే ఉంది. చాలాచోట్ల బీజేపీ పోటీ పడుతోంది. దళిత ఓట్ల దాదాపు వీసీకే నిలబడిన ప్రతీచోట అటే మొగ్గుచూపుతున్నాయి. ఈ చతుర్ముఖ పోటీలో విజయ్ కీలకం కానున్నారు. ఆయన చీల్చే ఓట్లన్నీ అధికార డీఎంకేవి మాత్రమే అవుతాయని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితో నాలుగు వైపుల నుంచి డీఎంకేను దెబ్బపడి.. అధికారం కోల్పోయే పరిస్థితి లేకపోలేదు.

మతం.. దేవుడు.. పవన్!
భారతదేశంలో సనాతన ధర్మ విశిష్టతను, చరిత్రను చెప్పే కీలక ఆలయాలన్నీ దక్షిణంలోనే ఉన్నాయి. అందులో తమిళనాడుది అగ్రస్థానం. అడుగడుగునా ఆకాశాన్నంటే గోపురాలు, ఆలయ శిఖరాలే స్వాగతం పలుకుతాయి. ఎంత హిందుత్వం బలంగా ఉందో.. అంతే వ్యతిరేకతా ఉందక్కడ. పెరియార్ నుంచి మొదలుకొని స్టాలిన్, ఉదయనిది దాకా.. ఎప్పుడూ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడి విమర్శల్లోకెక్కుతుంటారు. ప్రతిచోటా మతాన్ని కీలకంగా వాడుకునే బీజేపీ.. ఈసారి తమిళనాట ఎన్నికలకూ ప్రధానాస్త్రం చేయనుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల కిందటి నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఉపయోగించి గ్రౌండ్ వర్క్ బలంగా చేయిస్తోంది. తమిళ ప్రజలు ఎక్కువ ఆరాధించే తిరుమల కేంద్రంగా జరిగిన లడ్డూ కల్తీ నుంచి మొన్నటి షణ్మఖ యాత్ర దాకా పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. లడ్డూ కల్తీకి ఏ మాత్రం సంబంధం లేని స్టాలిన్ పేరెత్తి తమిళనాడు రాష్ట్రమంతటా చర్చలు లేవనెత్తడం, అక్కడి యువతను ఆకట్టుకొనే ప్రసంగాలు, తరచూ ఆ రాష్ట్రానికి వెళ్లిరావడం ఎన్నికలకు ముందస్తు అడుగులుగానే చూడవచ్చు. పవన్‌కు తమిళ్ స్పష్టంగా తెలియడం కూడా అదనపు బలం కానుంది. ఈ ఎన్నికల్లో పవన్ విల్లుగా, దేవుడు, హిందుత్వాలను బాణంగా స్టాలిన్‌పైకి ఎక్కుపెట్టనున్నదన్నది సుస్పష్టం.
అయితే, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 30 స్థానాల్లో గెలిచి, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న డీఎంకేను గెలవడం అంత సులువైతే కాదు. కానీ, అభివృద్ధి, పాలనాలోపాలపై తమిళ యువత నుంచి వస్తున్న వ్యతిరేకత, హిందూ ఓటర్లలో మార్పు, విజయ్ ఓట్ల చీలిక, పవన్ ప్రభావం కలిసొస్తే ఏఐడీఎంకే-బీజేపీ కూటమికి గెలుపు వరించవచ్చు. – OG Edit
One thought on “స్టాలిన్‌పై యుద్ధానికి బీజేపీ పవనాస్త్రం!”