BJP: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. చట్టం, చరిత్ర, విదేశాంగ, సామాజిక సేవా రంగాల్లో విశేషంగా పేరొందిన ఈ నలుగురు వ్యక్తులు భారత సమాజానికి గొప్ప సేవలందించినవారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారంతో ఈ నామినేషన్లు జరిగాయి. ఈ బీజేపీ మార్క్ ఎంపికపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఉజ్వల్ నికమ్ – న్యాయరంగానికి అద్భుత సేవలందించారు. పద్మశ్రీ అవార్డీ.
- 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టైన అజ్మల్ కసబ్ కేసును ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదించి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.
- 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులు, గుల్షన్ కుమార్ హత్య, ప్రమోద్ మహాజన్ హత్య వంటి సున్నితమైన కేసుల్లోనూ తన న్యాయ నైపుణ్యాన్ని చాటారు.
- ఆయనకు 2016లో పద్మశ్రీ అవార్డు లభించింది.
హర్షవర్ధన్ శ్రింగల – భారత విదేశాంగ వ్యవస్థకు నేతృత్వం అందించిన మాజీ విదేశాంగ కార్యదర్శి
- హర్షవర్ధన్ శ్రింగల 2021 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు.
- 2023లో భారత్‌లో విజయవంతంగా నిర్వహించిన G20 సమావేశాల చీఫ్ కోఆర్డినేటర్‌గా సేవలందించారు.
- న్యూయార్క్, ఢాకా, బ్యాంకాక్ వంటి కీలక ప్రాంతాల్లో భారత రాయబారిగా పనిచేశారు.
మీనాక్షి జైన్ – చరిత్రకు, భారతీయ మూల్యాలకు శాస్త్రీయ రూపం ఇచ్చిన చరిత్రకారిణి
- పద్మశ్రీ అవార్డీ డాక్టర్ మీనాక్షి జైన్, ప్రముఖ చరిత్ర, రాజకీయ శాస్త్రవేత్త.
- దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసారు.
- భారతీయ చరిత్రను స్వదేశీ దృష్టితో సమీక్షించే అంశాల్లో ఎంతో అవగాహన కలిగి ఉన్న ఆమె, అనేక పుస్తకాలు రచించారు.
- ఆమె ప్రముఖ జర్నలిస్ట్ గిరిలాల్ జైన్ కుమార్తె కావడం విశేషం.
సి. సదానందన్ మాస్టార్ – కేరళలో భాజపా కోసం జీవితాన్నే అర్పించిన సంఘ సేవకుడు
- కేరళ రాష్ట్రానికి చెందిన సి. సదానందన్ మాస్టార్, స్వతహాగా ఉపాధ్యాయుడు.
- 1994లో CPI(M) కార్యకర్తల దాడిలో తన రెండు కాళ్ళను కోల్పోయినా, మానసిక ధైర్యంతో పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా కొనసాగారు.
- కేరళలో భాజపా పునాదులను బలపరిచే ప్రయత్నాల్లో ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలిచింది.
ఈ నలుగురూ ఒక్కో దాంట్లో తమ ప్రత్యేకత చాటుకున్నవారే కావడం విశేషం.