Betting Apps: వీళ్లా సెల‌బ్రిటీలు..? స‌జ్జ‌నార్ సంచ‌ల‌న ట్వీట్‌!

trending sajjanar tweet

Share this article

Betting Apps: కాసుల క‌క్కుర్తికి బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేసి అమాయ‌క యువ‌త‌ను ప్రాణాల‌ను బ‌లిగొంటున్న సినీ, సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీల‌పై సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తీవ్రంగా మండిప‌డ్డారు. గురువారం ఈడీ కేసు న‌మోదైన 29 మంది సెల‌బ్రిటీల‌ను ఉటంకిస్తూ.. తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!? అని ప్ర‌శ్నించారు.

సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణం అయ్యారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లితండ్రులను చంపేస్తున్నారు. దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతున్నారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ఈ సమస్యలకు ప్రధాన కారకులు కాదా!? ఆలోచించండి అంటూ సెల‌బ్రిటీల‌ను ఉద్దేశించి ఆయ‌న ట్వీట్ చేశారు. కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటుపోయిన పర్లేదనే మీ ధోరణి సరైంది కాదనే ఖండించారు.

అయితే, తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త కొంత కాలంగా బెట్టింగ్ యాప్స్‌, డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఎంత‌పెద్ద సెల‌బ్రిటీ ఆ జాబితాలో ఉన్నా వ‌ద‌ల‌కుండా ముందుకే వెళ్తుంది. గ‌త మూడేళ్లుగా సజ్జ‌నార్ ఈ బెట్టింగ్ యాప్‌ల‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న స‌మ‌యం నుంచే మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ సంస్థ‌ల నామ‌రూపాల్లేకుండా చేసిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత కూడా అనేక స‌మ‌స్య‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా ఎప్పుడూ ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై స్పందించే స‌జ్జ‌నార్‌.. స్థాయి బేధం లేకుండా త‌ప్పుని త‌ప్ప‌ని ఖండిస్తుంటారు. ఓ రకంగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ తీవ్ర‌త‌ను బ‌య‌టికి తెలిసేలా చేసిందే ఆయ‌న‌. దీనిపై ఏళ్లుగా పోరాడుతున్న సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు నా అన్వేష‌ణ అన్వేష్‌ త‌దిత‌రుల‌తో లైవ్ చాట్ కూడా నిర్వ‌హించిన స‌జ్జ‌నార్‌.. అనేక విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. ఇప్పుడు అది తీవ్ర‌రూపం దాల్చి.. ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ సైతం కేసు న‌మోదు చేసే దాకా వ‌చ్చింది.

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలతో 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ECIR నమోదు చేసింది. వీరిపై ప్రజా జూద నిషేధ చట్టం, 1867 నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి.

Betting apps cases filed on celebrities vijay devarakonda and rana

ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు జ‌రుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.

ఈ కేసులో ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణిత సుభాష్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ తదితరులు ఉన్నారు. వీరిపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, పంజాగుట్ట, మియాపూర్‌, సూర్యాపేట‌, విశాఖపట్నం పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఈడీ అనుమానం ప్రకారం, జంగ్లీ రమ్మీ, A23, జీత్‌విన్‌, పరీమ్యాచ్‌, లోటస్365 లాంటి బెట్టింగ్ ప్లాట్‌ఫాంలకు చెందిన ప్రమోషన్ల ద్వారా భారీ మొత్తంలో డబ్బు లాండరింగ్ జరిగి ఉండవచ్చని పేర్కొంది. ECIRను BNS సెక్షన్లు 318(4), 112 r/w 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 3(A), 4, ఐటీ యాక్ట్ 2000, 2008 సెక్షన్ 66D కింద నమోదు చేశారు.

ఈ ఏడాది మార్చిలో సైబరాబాద్ పోలీస్‌లు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్‌లపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ తారలు తాము ఎటువంటి అక్రమ యాప్‌లను ప్రమోట్ చేయలేదని, కేవలం లీగల్ స్కిల్-బేస్డ్ గేమ్స్‌నే ప్రమోట్ చేశామన్నారు. ప్రకాష్ రాజ్ అయితే 2017లో తాను ఒక యాప్‌ ప్రమోషన్‌ను కొనసాగించలేదని, తప్పుగా భావించి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కేసుకు కారణమైన ఫిర్యాదుదారు ఫణీంద్ర శర్మ అనే మియాపూర్ నివాసి. పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీని వల్ల సమాజానికి, ప్రజలకు నష్టం జరుగుతోందని, త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ సంపాద‌న ఆశించి అనేకమంది ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *