Betting Apps: డబ్బుల సంపాధన కోసం కొందరు సెలబ్రిటీలు దిగజారారు.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌తో ఎంతోమందిని ఆ ఉచ్చులోకి దించి.. అప్పుల పాలయ్యేలా చేసి వారి చావులకు కారణమయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసు ఇప్పుడు సినీ ఇండస్ట్రీని వణికిస్తోంది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా Enforcement Directorate (ఈడీ) 29మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో టాలీవుడ్ నటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా పలు రంగాల ప్రముఖుల పేర్లు చర్చనీయాంశమవుతున్నాయి.
వారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, నయని పావని, హర్ష సాయి, టేస్టీ తేజ, రీతూ చౌదరి, ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏమైందంటే..?
తెలంగాణ పోలీసులు గత కొన్ని నెలలుగా నిషేధిత బెట్టింగ్ యాప్స్ పై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది సినీ ప్రముఖులు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్స్‌కి ప్రచారం చేస్తూ తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదన అంటూ పరోక్షంగా యూజర్లను ఆకర్షించారని గుర్తించారు.
వారు చేసిన ఈ ప్రమోషన్‌ల వల్ల, అనేక మంది యూజర్లు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు నమోదయ్యాయి. అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద విచారణ చేపట్టింది.
ఎంత పారితోషికం తీసుకున్నారంటే…
ఈ ప్రచారానికి సినీ సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా స్టార్స్ లక్షల్లో పారితోషికాలు, కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా యాప్ లింకులను పంచుతూ వినియోగదారులను మోసపూరితంగా ఆకర్షించారని అధికారులు చెబుతున్నారు.
ఇంకెవరి పేర్లు బయట పడతాయో?
ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. దర్యాప్తు సాగుతున్న తీరును బట్టి, ఇంకా ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఇందులో కొంతమంది రాజకీయ ప్రతినిధుల పేర్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కలకలం
టాలీవుడ్‌లో ఇప్పటికే ఈ వార్త పెద్ద దుమారం రేపుతోంది. సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఏ సెలబ్రిటీ అయినా ప్రచారం చేసే ముందు రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.