Banakacharla: బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. కచ్చితంగా కట్టితీరాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆపి తీరుతామంటూ తెలంగాణ సర్కారు సవాళ్ల నడుమ.. తెలంగాణే గెలిచినట్లు కనిపించింది. రెండు రోజుల క్రితం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర సర్కారు తేల్చి చెప్పింది. దీంతో, ఇది మా విజయమేనంటూ అటు అధికార కాంగ్రెస్ పార్టీ(Congress), ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS Party) క్రెడిట్ ఇచ్చేసుకుంటున్నాయి. కథ ముగిసిందని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, ఆ కథ ఇంకా ముగియలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కేంద్ర జలసంఘం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు లేఖ రాసింది. కారణాలు, ఖర్చులు, లాభనష్టాల వివరాలన్నీ రాసి పంపాలని కోరింది. దీంతో బనకచర్ల మరోమారు తెరపైకి రాబోతోంది.
ఏం జరుగుతోంది..?
సముద్రంలోకి వృథాగా చేరుతోన్న గోదావరి మిగులు జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించేందుకు ఏపీ సర్కారు ప్రణాళిక రచించింది. బనకచర్ల వద్ద ప్రాజెక్టు నిర్మాణంతో రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని.. సాగుకు నీరందుతుందని భావించారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణ(Telangana) రాష్ట్రానికి దాదాపు 200 టీఎంసీల దాకా నష్టం ఏర్పడుతుంది. ఆ నష్టం తెలంగాణలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలంగాణలోని అధికార కాంగ్రెస్ సర్కారుతో పాటు, జలవనరుల రంగ నిపుణులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు అఖిలపక్ష సమావేశం, కేంద్ర జలసంఘం(CWC), కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించి విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. ఈ ప్రాజెక్టు అనుమతులను కేంద్ర సర్కారు తిరస్కరించింది. ఏపీ సర్కారు పంపిన డీపీఆర్‌ను తిరిగి పంపింది.
రాజకీయ మంటలు..
ఇదే అవకాశంగా భావించిన తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిపై సర్కారుపై ఒత్తిడి పెంచింది. మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో.. జరిగే నష్టాన్ని ఎండగట్టింది. కాంగ్రెస్ సర్కారు మద్దతుతోనే ఏపీలో చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కారు బనకచర్లపై ముందుకెళ్తొందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సహా కాంగ్రెస్ మంత్రులు, నేతలంతా గట్టిగా తిప్పికొట్టారు. గత ప్రభుత్వాధినేత కేసీఆర్ హయాంలోనే ఈ నిర్ణయాలకు అడుగుపడిందని.. బనకచర్ల ప్రాజెక్టు పాపం బీఆర్ఎస్ పార్టీదేనని బదులు ప్రచారం చేసింది. ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో బీఆర్ఎస్‌ను సైలెంట్ చేసింది. మరోవైపు, ఈ ప్రాజెక్టుకు బీజేపీ సపోర్ట్ చేస్తోందని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీనిక కూడా పనిలో పనిగా టార్గెట్ చేసింది.

ఏం జరగనుంది..?
కేంద్ర జలసంఘం డీపీఆర్‌ను ఏపీ సర్కారుకు వెనక్కి పంపడంతో ఇక ప్రాజెక్టు ఆగిపోయిందనుకున్నారంతా. కానీ, శుక్రవారం అనూహ్యంగా కేంద్ర జలసంఘం ఏపీ సర్కారుకు లేఖ రాసింది. ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాలు, ఖర్చులు, బనకచర్లకు సంబంధించిన అన్ని వివరాలు పంపాలని మరోసారి కోరింది. దీంతో ఈ కథ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవేళ బనకచర్ల నిర్మాణం మొదలు పెడితే.. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా గురించి తెలంగాణ నిపుణులు పెట్టిన ప్రతిపాదనకు ఓకే చెప్పే యోచనలో ఏపీ సర్కారు ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే దిల్లీలో చంద్రబాబు మరోసారి చక్రం తిప్పారు. కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చి.. కేంద్ర జలసంఘం మరోమారు లేఖ రాసేలా చేశారని సమాచారం. దీనిపై త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇరు రాష్ట్రాల జలవనరుల నిపుణులతో హైదరాబాద్‌లో ఓ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాలకు నష్టం జరగకుండా ముందుకెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నేతలనూ ఆహ్వానించనున్నారని సమాచారం.