
Balochistan: ఏళ్లుగా పాకిస్థాన్(Pakistan) నుంచి వేర్పాటు కోరుతున్న బలూచిస్థాన్ ఈరోజు స్వాతంత్య్రం ప్రకటించుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ కీలక ప్రాంతం. విశేషమైన చారిత్రక, పర్యాటక సంపద, విలువైన ఖనిజాలకు నెలవుగా ఉన్న బలూచ్ ప్రాంతాన్ని పాకిస్థాన్ తమ బలంగా భావిస్తుంది. అయితే, తమ ప్రాంతంపై పాక్ ఆధిపత్యం సహించని కొందరు యువకులు, రాజకీయ నేతలు సొంతంగా ఫ్రీ బలూచిస్థాన్ మూవ్‌మెంట్ పార్టీ(Free Balochistan Movement) పేరిట ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు, నిరసనలు చేస్తున్నారు. వీరిపై టెర్రరిస్టులు, పాకిస్థాన్ సైన్యం దాడులు చేసి వేలాదిమందిని బలి తీసుకున్నాయి. దీనికి ప్రతిగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(Balochistan Liberaiton Army)గా ఏర్పడిన అక్కడి ఉద్యమకారులు ఇరాన్ లోని కొన్ని తీవ్రవాద గ్రూపులు, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల సాయంతో పాక్‌పై తిరగబడ్డాయి. 2011 నుంచి ఈ పోరు తీవ్రతరం కాగా.. ఇటీవల భారత్ పాక్ యుద్ధం వీరికి కలిసొచ్చింది.

భారత్ పాక్‌పై ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడంతో.. ఇదే అదనుగా భావించిన బలూచిస్థాన్ ఆర్మీ.. పాకిస్థాన్ సైనికులపై ముప్పేట దాడికి దిగింది. వందల మంది సైనికులను హతమార్చింది. బలూచిస్థాన్ వ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రతరం కాగా.. బుధవారం తమకు తాము దేశంగా ఏర్పడ్డామని అక్కడి FBM పార్టీ ప్రకటించింది. ఇకపై తమది స్వతంత్య్ర దేశమని.. పాక్ ఆధిపత్యం అక్కర్లేదని ప్రకటించింది. ఇప్పుడు ఈ దేశపు నూతన పార్లమెంట్ భవనం, దేశ జాతీయ పతాకం, జాతీయ గీతాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ పేరిట ఏర్పడిన ఈ దేశం ప్రపంచంలో 196 దేశంగా అవతరించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మొదటి నుంచి పాకిస్థాన్‌ను దూరం పెడుతూ వచ్చిన భారత్ అన్ని విధాలా బలూచిస్థాన్ కు అండగా నిలిచింది. అక్కడి పౌరులు సైతం సోషల్ మీడియాలో పూర్తిగా భారత్‌కు మద్దతునిస్తూ పాకిస్థాన్‌పై తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్, బలూచిస్థాన్, భారత్ మూడు సోదర దేశాలంటూ పోస్టులు పెడుతున్నారు.