ATM: దేశవ్యాప్తంగా ఏటీఎంలలో క్రమంగా పెద్దనోట్లు మాయమవుతున్నాయి. చిన్న నోట్ల అందుబాటు పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనలతో బ్యాంకులు చిన్న నోట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు సుమారు 73 శాతం వరకు చేరినట్లు నివేధికలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు ఎక్కువశాతం ఏటీఎం(ATM)లలో రూ.500 నోట్లు ఎక్కువగా ఉండేవి. దీంతో చిన్న లావాదేవీల్లో ప్రజలకు తరచూ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్న దుకాణాలు, ఆటోలు, రవాణా సేవల్లో చిల్లర కోసం ప్రజలు ఇబ్బంది పడటం నిత్యజీవితంలో సర్వసాధారణంగా మారింది. దీనికి తోడు నల్లధనం పెరిగిపోవడానికి ఈ పెద్దనోట్లే కారణమవుతున్నాయి.
దీనికి పరిష్కారంగానే రూ.వెయ్యి, రూ.500 నోట్లను డీమానిటైజేషన్‌తో రద్దు చేసిన సర్కారు.. రూ.2వేలు, రూ.500 కొత్త నోట్లను ముద్రించింది. కొంతకాలానికే రూ.2వేల నోట్లను కూడా రద్దు చేసేసింది. ఇప్పుడు మరోసారి రూ.500 నోట్లు రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు సూచనలు జారీ చేసింది. మార్కెట్లో పెద్ద నోట్ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు, సామాన్యుల జీవితాల్లో సమస్యగా ఉన్న చిన్న నోట్ల పరిష్కారానికి.. RBI బ్యాంకులకు ఏటీఎంలలో చిన్న నోట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఈ సూచనలతో బ్యాంకులు చర్యలు తీసుకుని చిన్న నోట్లు ఎక్కువగా ఏటీఎంలలో నింపడం ప్రారంభించాయి. గత కొన్ని వారాలుగా బ్యాంకులు చిన్న నోట్లను మళ్లీ ప్రాధాన్యంలోకి తీసుకొచ్చాయి. గతంలో పెద్ద నోట్లే ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల ప్రజల నుంచి తరచూ బ్యాంకులకు ఫిర్యాదులందేవి. ఇప్పుడు బ్యాంకులు అందుబాటులో ఉన్న ఏటీఎంలలో చిన్న నోట్ల వాటాను 73 శాతం వరకు పెంచాయి.
ఇప్పటికే దేశంలోని అన్ని పెద్ద బ్యాంకులు రూ.100, రూ.200 నోట్లను ఎక్కువగా ఏటీఎంలలో అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో ప్రజలు నేరుగా ఏటీఎంల ద్వారా చిన్న నోట్లు పొందే అవకాశం కలుగుతోంది.
ప్రస్తుతం ఏటీఎంలలో సుమారు 73 శాతం వరకు చిన్న నోట్ల లభ్యత ఉంది. మిగిలిన భాగం రూ.500 నోట్లుగా కొనసాగుతోంది. దీనితో ప్రజలకు చిల్లర మార్పిడి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఇలా చిన్న నోట్ల లభ్యత పెరగడంతో చిన్న వ్యాపారాలు, సాధారణ ప్రజలకు మేలు కలిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో చిన్న నోట్ల లభ్యత మరింత పెరిగే అవకాశముందని బ్యాంకు నిపుణులు చెబుతున్నారు.