Cyber Crime: నమస్తే.. నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు మీద దిల్లీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఆ బ్యాంకు అకౌంట్ నుంచి ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. సదాకత్ ఖాన్ అనే వ్యక్తి మీ పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు.. మీ పాత్రేమైనా ఉందా ఇందులో..? ఈ గొంతు వినగానే వణికిపోయాడో విశ్రాంత ఉపాధ్యాయుడు. లేదండి.. నేను కాదు. నాకేం సంబంధం లేదని చెబుతూనే అవతలి వ్యక్తి అడిగినట్టు ఆ టీచర్‌కు చెందిన మరో బ్యాంకు ఖాతా వివరాలు చెప్పేశారు. నిమిషాల వ్యవధిలోనే అకౌంట్లో నుంచి ఆరు దఫాలుగా రూ.1కోటి 20 లక్షలు మాయమయ్యాయి. కొద్దిసేపటికి తాను మోసపోయానని గ్రహించేలోపే అంతా అయిపోయింది. 60ఏళ్ల సర్వీసు, పెన్షన్ డబ్బులతో కూడబెట్టిన డబ్బులన్నీ నిమిషాల్లో సైబర్ మోసగాళ్ల పాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని తిరుపతి(Tirupati)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నవోదయ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి కొద్దిరోజుల క్రితం ఓ తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో తనను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకన్న అవతలి వ్యక్తి రిటైర్డ్ ఉపాధ్యాయున్ని పలు విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేశాడు. తనకు దిల్లీ కెనరా బ్యాంకులో ఓ ఖాతా ఉందని. దాన్ని సదాకత్ ఖాన్ అనే వ్యక్తి వాడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ బ్యాంకు ఖాతాను ఉపయోగించే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని భయపెట్టాడు. ఆ మాటలకు బెంబేలెత్తిపోయిన టీచర్.. తాను కాదని చెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ ఫోన్ కట్ అవగానే మీ ఇంటికి NIA, ED, CID, NCT అధికారు వస్తారు. మీపై కేసు నమోదు చేస్తాం.. మీరు సహకరించకపోతే యాక్షన్ ఉంటుందని బెదిరించాడు. భయపడిన టీచర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే మీకు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు ఏమేం ఉన్నాయో చెప్పండి ఇక్కడ మా రిపోర్ట్ నుంచి మీ పేరు తొలగిస్తాం అని చెప్పాడు. మోసగాన్ని నమ్మిన టీచర్ తన బ్యాంకు ఖాతా వివరాలు చెప్పారు. ఆ తర్వాత కేవలం ఆరు ట్రాన్సాక్షన్లలోనే సైబర్ మోసగాళ్లు మొత్తం రూ.1 కోటి 20 లక్షల 80 వేలు ఆన్లైన్ ద్వారా కాజేశారు.
తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫిర్యాదు చేశాడు. అలాగే తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అలిపిరి సీఐ రామ్ కిషోర్ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు, 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరికీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దని సూచిస్తున్నారు. Complaint at https://cybercrime.gov.in/ .

⚠️ సైబర్ మోసాల నుంచి జాగ్రత్త! మీ డబ్బు, సమాచారం రక్షించుకోండి
ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు (సైబర్ ఫ్రాడ్స్) అతి వేగంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు ఫేక్ లింకులు పంపించడం, ఫోన్ కాల్స్ చేయడం, మీ బ్యాంక్ వివరాలు, OTPలు అడగడం ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం: బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు మీ వద్ద వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు, OTPలు ఎప్పుడూ అడగవు. ఫేక్ లింకులను క్లిక్ చేయకండి, అనధికార యాప్‌లు డౌన్లోడ్ చేయవద్దు. ఎవరికైనా మీ ఖాతా వివరాలు చెప్పకండి. మోసపూరిత కార్యకలాపాలు కనిపించిన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.
ఇటీవల మోసగాళ్లు మరింత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వారు పోలీసు అధికారిగా, సీబీఐ, ఈడీ లేదా కోర్టు సిబ్బందిగా నటిస్తూ మీకు కాల్ చేస్తారు. “మీపై క్రిమినల్ కేసు ఉంది”, “మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం జరిగింది”, “మీ ఖాతాలో అక్రమ డబ్బులు ఉన్నాయ్” అంటూ భయపెడతారు. మీరు జైలుకు పోతారని బెదిరిస్తూ తక్షణమే వారి చెప్పిన ఖాతాలో డబ్బు పంపాలని ఒత్తిడి చేస్తారు.
ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే అస్సలు భయపడకండి. ఇది ఖచ్చితంగా సైబర్ మోసం. ప్రభుత్వ శాఖలు ఎప్పుడూ ఇలా ఫోన్ ద్వారా డబ్బు అడగవు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
జాగ్రత్తగా ఉండండి – సైబర్ మోసాల నుండి మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి.