
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రేషన్‌కార్డు దారులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. కొత్త కార్డుల జారీకి కసరత్తు చేపట్టిన ప్రభుత్వం.. కార్డుల జారీకి ముందు రేషన్ కార్డుకు ఈ-కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఈ ప్రక్రియకు ఏప్రిల్ 30వ తేదీ చివరి రోజు కాగా.. ఇప్పటికీ చాలామంది కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదు. ఇలాంటి వారందరికీ మరోమారు అవకాశమిచ్చింది ఏపీ సర్కారు. గడువును జూన్ 30 వరకు పొడగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు లోపు ఈకేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
బోగస్ కార్డులను ఏరివేయడంతో పాటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ కేవైసీ ప్రక్రియను తీసుకువచ్చింది ఏపీ సర్కారు. అందులో భాగంగానే జనవరిలోనే ఈ-కేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు ప్రకటనలు ఇచ్చారు. రేషన్‌కార్డులు ఉన్న వారు రేషన్ డీలర్లు, ఎండీయూ వాహనాల వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఈ కేవైసీని చేసుకునే విధానాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చారు.