AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద రూ. 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను పట్టించుకోలేదని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురాలేదని ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ను ఏటా వాయిదా వేస్తూ, పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు. “గత పాలకులు రౌడీయిజం, గుండాయిజం చేసిన వాళ్లు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
మా ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదు..
పవన్ కళ్యాణ్ తాము కక్షపూరితంగా వ్యవహరించబోమని మరోసారి స్పష్టం చేశారు. “తప్పులు చేస్తే శిక్షిస్తాం కానీ, వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా కోపం లేదు” అన్నారు. వైసీపీ నేతలు గొంతు కోస్తాం అంటూ బడాయిపుచ్చుకుంటే, మేమెందుకు భయపడి తగ్గిపోతామని ప్రశ్నించారు. సినిమా డైలాగులు నిజ జీవితంలో పనికిరావని.. సినిమాల్లోనే బావుంటాయని స్పష్టం చేశారు. టార్గెటెడ్‌గా ఎవరినీ ఇబ్బంది పెట్టమని.. తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టమన్నారు. మేం రాగానే.. మీ అంతు చూస్తామంటూ వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. అసలు మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్.

రూ.4వేల కోట్లే ఖర్చు చేశారు..
గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను సరిగ్గా వినియోగించలేదని పవన్ ఆరోపించారు. “రూ. 26వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమన్నా, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అవి కూడా వృథా అయ్యాయి” అన్నారు. తమ ప్రభుత్వం కేంద్రంతో చర్చించి మొదటి విడత నిధులు తీసుకొచ్చామని వివరించారు.
ఆ భూములు మా బాధ్యత..
జగన్ ప్రభుత్వ హయాంలో దేవాదాయ, అటవీ శాఖ భూముల్లో అక్రమంగా కబ్జాలు జరిగాయని పవన్ ఆరోపించారు. “ఈ భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం నిబద్ధంగా పని చేస్తుంది,” అని స్పష్టం చేశారు. అలాగే, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన నాయకులు ప్రజలకు పనిచేయాలన్నారు.
బాలినేనిపై ప్రశంసలు
సభలో పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బాలినేని గారు నాకు ఎప్పుడూ అండగా ఉండేవారు. మంచి అవగాహన ఉన్న నాయకుడు, కక్షపూరిత ధోరణి లేని వ్యక్తి” అని కొనియాడారు. రాజకీయాల్లో అర్థవంతమైన మిత్రత్వం, పరస్పర గౌరవం అవసరమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా కోసం తన కృషిని మరోసారి గుర్తు చేశారు. “ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తాగునీటి కోసం రాష్ట్రంలో తీసుకొచ్చిన అతి పెద్ద ప్రాజెక్ట్” అని వివరించారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు.