AP Dy CM: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని ఇక్రిశాట్ (ICRISAT – International Crops Research Institute) క్యాంపస్‌లో పర్యటించారు. అయితే, ఇది అధికారిక పర్యటన కాదట.. వ్యక్తిగత పని మీద ఈ క్యాంపస్‌లోని పాఠశాలను ఆయన సందర్శించినట్లు సమాచారం. ఆయన చిన్నకుమారుడు మార్క్ పవనోవిచ్‌ను ఈ పాఠశాలలో చేర్పించేందుకు అడ్మిషన్ పొందేందుకు పవన్ కళ్యాణే నేరుగా వచ్చారట. ఈ పాఠశాలను అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఇక్రిశాట్ నిర్వహిస్తోంది. అధునాతన శిక్షణ, శాస్త్ర సాంకేతికతలతో చిన్నతనం నుంచే విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించుతోంది.
గత కొన్ని వారాల క్రితం సింగపూర్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మార్క్ గాయపడ్డ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రమాదం అనంతరం సింగపూర్‌లో చికిత్స పొందిన మార్క్‌ను పవన్ స్వయంగా అక్కడికి వెళ్లి తీసుకువచ్చారు. ప్రమాద సమయానికి పవన్ కళ్యాణ్ అరకు లోయలో అధికారిక పర్యటనలో ఉండగా.. ప్రమాద వార్త తెలిసినా ప్రజలకిచ్చిన మాటకోసం పర్యటన ముగించుకున్న వెంటనే హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లారు.

ఆ ప్రమాదంలో మార్క్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. కాళ్లు, చేతులకు గాయాలవడం తో పాటు పొగ వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగినట్లు వైద్యులు వెల్లడించారు. వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించి, కొన్ని రోజుల పాటు సింగపూర్‌లో వైద్యం అందించారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత మార్క్‌ను హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మరికొంతకాలం పాటు చికిత్స కొనసాగింది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడం భవిష్యత్తులో మార్క్‌కి ఇబ్బందిగా మారుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నాడు అని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పవన్ తన కుమారుడిని ఇకపై ఇండియాలోనే చదివించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో పేరు పొందిన ఇక్రిశాట్ క్యాంపస్‌లోని విద్యాసంస్థలో అడ్మిషన్ కోసం ఈ పర్యటన జరిగిందని సమాచారం. పవన్ నేరుగా టీచర్లను కలుసుకుని, చదువు విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అనా లెజినోవా కుటుంబానికి సింగపూర్‌లో వ్యాపారాలు ఉండటంతో పాటు ఆమె కుటుంబం అక్కడే స్థిరపడింది. దీంతో మార్క్‌ను ఇన్నిరోజులూ అక్కడే ఉంచారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత తన కుమారుడిని తనవెంటే ఉంచుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారని.. అందుకే పాఠశాల అడ్మిషన్ కోసం సైతం తానే వెళ్లారని తెలిసింది.
దీనికి తోడు మార్క్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఎక్కువ ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ప్రాంతం కోసం వెతికిన పవన్.. ఈ పాఠశాలను ఎంచుకున్నారు. రికవరీ అయ్యాక ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యాభ్యాసం పూర్తి చేయించేందుకు ఇక్కడికి వచ్చారు.
ఇక రాజకీయంగా చూస్తే, ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పదవికి సంబంధించిన బాధ్యతలతో బిజీగా ఉంటూనే, కుటుంబం పట్ల కూడా సమానమైన శ్రద్ధ చూపుతుండటం ఓ నేతగా ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటింది. తన కుమారుడి భవిష్యత్తు విషయంలో తీసుకున్న శ్రద్ధ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.