AP: శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పందించారు. ఆధునిక సౌకర్యాలకు దూరంగా, ఆధ్యాత్మిక మార్గంలో జీవించేందుకు ఏర్పాటైన ఈ గ్రామం అగ్ని ప్రమాదానికి గురవడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ చేయాలని, అనుమానాస్పద కోణాలపై కూడా దర్యాప్తు జరపాలని సంబంధిత అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో జిల్లా అధికారులతో మాట్లాడి, అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పడిన కూర్మ గ్రామం, యాంత్రిక జీవనశైలికి భిన్నంగా సనాతన ధార్మిక పద్ధతులలో జీవించేలా తీర్చిదిద్దబడింది. ఇక్కడ నివసించే గ్రామస్తులు మట్టి ఇళ్లలో జీవిస్తూ, ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. గ్రామంలోని పిల్లలు వేద విద్యతో పాటు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలను నైపుణ్యంగా అభ్యసిస్తున్నారు.
అయితే, ఇటీవల గ్రామంలోని రాధాకృష్ణ మందిరంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ నష్టం కలిగించింది. భక్తులు భయంతో పరుగులు తీయగా, విలువైన గ్రంథాలు, పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారుగా రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సాక్ష్యాలు సేకరిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో గతంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుందని అక్కడి స్థానికులు చెబుతున్న క్రమంలో ఆ దిశగానూ పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ గ్రామ పునరుద్ధరణకు ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు.