AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు తనదైన రీతిలో దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రి లోకేష్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూనే సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎంత పెద్ద సమస్య అయినా క్షణాల్లో పరిష్కారం చూపించేస్తున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి దారి మరీ ప్రత్యేకం. వివిధ కార్యక్రమాల్లో ఆయన దృష్టికి వచ్చిన సమస్యల్ని .. విని వదిలేయకుండా ఆన్ ది స్పాట్ పరిష్కారం చూపిస్తున్నారు. గురువారం ఓ సీరియస్ అంశంపై అంతే వేగంగా స్పందించిన పవన్.. ఏకంగా కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడి బాధితులకో దారి చూపించారు.
ఏనీ విజయనగరానికి చెందిన సూర్యకుమారి అనే మహిళ గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసింది. తన ఇద్దరు కుమారులు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఉచ్చులో చిక్కుకున్నారని.. వారిని మయన్మార్ సరిహద్దుల్లో బంధించారని తెలిపింది. వారిని రక్షించాలంటూ ఏడుస్తూ విన్నవించుకున్న ఆమెకు.. ఆన్ ది స్పాట్ భరసానిచ్చారు పవన్. వెంటనే కేంద్ర విదేశాంగ విభాగాన్ని సంప్రదించారు. సమస్యను వివరించి.. ఈ ఇద్దరు యువకులతో పాటు అక్కడ చిక్కుకున్న మిగతా వాళ్లనూ విడిపించాలని కోరారు. దీనికి అటువైపు నుంచి కూడా అంతే వేగంగా స్పందన రావడం గమనార్హం. తక్షణ స్పందన ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ త్వరలోనే బాధితుల్ని స్వస్థలాలకు రప్పిస్తామని హామీ ఇచ్చింది. పవన్ ఇచ్చిన ధైర్యంతో ఇంటికి తిరుగు పయనమైందా కుటుంబం.
ఈ ఒక్కటే కాదు..!
విజయనగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి యువకులు గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వెళ్లేందుకు పలువురు ఏజెంట్లను ఆశ్రయించారు. వీరి నుంచి రూ.లక్షల్లో దండుకున్న ఏజెంట్లు.. వీరిని బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. కాస్త చదువు తెలిసిన వారితో ఏకంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచీ బాధితులున్నారు. జీవనోపాధి ఆశతో వచ్చిన యువకులను ఏజెంట్లు బలిపశువుల్ని చేస్తున్నారు. బయటపడేందుకూ దారిలేని పరిస్థితుల్లో కుటుంబాలకు గోడు వెల్లబోసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఇటీవలె నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో వచ్చిన గోట్ లైఫ్ అందరినీ కలిచివేసింది. అందులో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఓ యువకులు.. పారిపోయేందుకు ప్రయత్నించి తీరం కనిపించని ఎడారుల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటీవల భారత్‌లో బతుకుదామన్న ఆశతో.. వీసాలు పొందలేక.. పాకిస్థాన్ నుంచి అడ్డదారుల్లో పారిపోయి వచ్చిన ఓ హిందూ జంట.. థార్ ఎడారిలో చిక్కుకుని రోజుల తరబడి నడిచీ నడిచీ దప్పిక, ఆకలితో ఓ ప్రాంతంలో కూలిపోయారు. రెండు, మూడురోజుల తర్వాత గుర్తించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. దాదాపు ఇలాంటి ఘటనలు దేశమంతటా కనిపిస్తూనే ఉన్నాయి.

పవన్ ఎంట్రీ.. పరిస్థితి మారుతుందా..?
ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీతో ఈ పరిస్థితి మారుతుందని బాధితులు ఆశిస్తున్నారు. ఇప్పటికే మంత్రి లోకేష్ కార్యాలయం సైతం హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న బాధితుల కోసం ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పవన్ కూడా దీనిపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సాయంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులందరికీ సాయం అందించేందుకు, స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఇక్కడే ఉపాధి కల్పించేందుకూ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.