తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్, 35 ఓ చిన్న కథ కాదు.. పిల్లల చదువులను, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను ముడేస్తూ వచ్చిన ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఎంతలా అలరించాయో చెప్పక్కర్లేదు. అలాంటి వైబ్‌నే ఇప్పుడ మళ్లీ క్రియేట్ చేస్తోంది “అనగనగా”.

అక్కినేని సుమంత్(Akkineni Sumanth) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈటీవీ విన్(ETV Win) ఓటీటీలో గురువారం విడుదలై ఆకట్టుకుంటోంది. పాఠాలను బట్టీ పట్టే పద్ధతికి వ్యతిరేకంగా నడిచే టీచర్ వ్యాస్ పాత్రలో సుమంత్, ర్యాంకులే లక్ష్యంగా నడిచే అదే పాఠశాలకు ప్రిన్సిపల్‌గా, వ్యాస్ భార్య భాగీ పాత్రలో కాజల్ చౌదరి.. రాజారెడ్డి పాత్రలో అవసరాల శ్రీనివాస్‌తో పాటు.. వ్యాస్ కుమారుడు రామ్ పాత్రలో మాస్టర్ విహర్ష్ నటించారు.
నేటి విద్యా వ్యవస్థకు సెటైరికల్‌గా తీసిన ఈ సినిమా ఆసాంతం ప్రేక్షకులను అలరిస్తుంది. చూస్తున్నంతసేపు సినిమా కథలోని సహజత్వం, భావోద్వేగాలు మన ఇంట్లోనే కథంతా నడుస్తోందన్న భావన కలిగిస్తాయి. ఓ సాధారణ కథను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు.
కథేంటంటే..: బట్టీ పట్టి పరీక్షల్లో ఇప్పుడు గెలిచినా జీవితంలో కచ్చితంగా ఓడిపోతారని పోరాడే టీచర్ వ్యాస్‌కు, అదే పాఠశాలలో ప్రిన్సిపల్‌గా చేస్తున్న అతని భార్య భాగీతో సహా అందరూ వ్యతిరేకం. పాఠాలు చెప్పే పద్దతి మార్చేందుకు ప్రయత్నించి పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేందుకు కారణమవుతాడు. అందుకు సస్పెండ్ అయిన వ్యాస్.. ఎలా ఆ పిల్లలందరినీ టాప్ మార్కులతో పాస్ చేయించాడు..? బట్టీ పట్టే చదువులపై ఎలా గెలిచాడో చెప్పేదే ఈ కథ.
బలం: కథలో సహజత్వం, నటన, స్క్రీన్ ప్లే, మనసుకు హత్తుకునే బ్యాక్‌గ్రౌండ్ సంగీతం
బలహీనత: అక్కడక్కడా సాగదీత, పాత కథ.
అనగనగా.. ఓ మంచి సినిమా! వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చుని చూసేందుకు అనగనగా మంచి ఎంపిక. ప్రస్తుత పరిస్థితుల్లో, జీవితాన్ని అర్థం చేయించాలంటే మీ పిల్లలతో కలసి తప్పకుండా చూడాల్సిన సినిమా.
రేటింగ్: 🌟🌟🌟🌟 (4/5)