అమెరికా ఏలియన్ల(Aliens)ను బంధించిందటా.. సెక్టార్-51లో గ్రహాంతర జీవులపై ప్రయోగాలు జరుగుతున్నాయట.. దాదాపు డెబ్భై ఏళ్లుగా సామాజిక మాధ్యమాలతో పాటు జనాల్లోనూ ఇదే ప్రచారం. ఈ ప్రచారానికి తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏలియన్లు(భూగ్రహాంతర జీవులు), యూఎఫ్‌ఓలు (UFOs – గుర్తించని ఎగిరే వస్తువులు)పై అమెరికా ఏళ్లుగా దాచిపెట్టిన రహస్య పత్రాలను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దశాబ్దాలుగా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఏలియన్స్ అంశంపై స్పష్టత తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏం బయటపడబోతోంది..?
రక్షణ శాఖ (పెంటగాన్), గూఢచారి సంస్థలు, అంతరిక్ష పరిశోధన విభాగాలు తమ వద్ద ఉన్న ఏలియన్స్, యూఎఫ్‌ఓల దర్యాప్తు నివేదికలు, వీడియోలు, రాడార్ డేటా, అంతర్గత కమ్యూనికేషన్ పత్రాలను సమీక్షించి విడుదల చేయాల్సి ఉంటుందని సమాచారం. అయితే జాతీయ భద్రతకు భంగం కలగకుండా ఉండే అంశాలు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి రావచ్చు.
ఇప్పటి పరిస్థితి
ఇటీవలి కాలంలో అమెరికా ప్రభుత్వం ‘అన్వేషించని వైమానిక పరిణామాలు’ (UAPs) పేరుతో కొన్ని వీడియోలను అధికారికంగా అంగీకరించింది. సైనిక పైలట్లు గాల్లో గుర్తించలేని వస్తువులను చూశామని వెల్లడించిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే అవి ఏలియన్స్‌కు సంబంధించినవే అని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.
అమెరికాలోని ‘ఏరియా 51’లో ఎలియన్స్ నౌకలు దాచిపెట్టారనే ఆరోపణలు, ప్రభుత్వం ఏలియన్స్‌తో రహస్య ఒప్పందాలు చేసుకుందని ప్రచారాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటికి శాస్త్రీయంగా లేదా అధికారికంగా ఆధారాలు లేవు.
శాస్త్రవేత్తల అభిప్రాయం
విశ్వంలో ఇతర గ్రహాలపై జీవం(Aliens) ఉండే అవకాశం పూర్తిగా ఖండించలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఏలియన్స్ భూమిని సందర్శించారనే విషయానికి ఇప్పటివరకు ధృవీకరించిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. గుర్తించలేని వస్తువులు అన్నీ ఏలియన్స్‌కు చెందినవే కావని, అవి సాంకేతిక పరీక్షలు లేదా సహజ ప్రకృతి ఘటనలు కావచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఏం జరగబోతోంది…?
రహస్య ఫైళ్ల సమీక్షకు సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని పత్రాలు సవరించి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫైళ్ల ద్వారా ఏలియన్స్‌పై నిజాలు బయటపడతాయా? లేక మరిన్ని అనుమానాలకు తావిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
