విమానంలో 242 మంది ప్రయాణీకులు.. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం ఉన్నట్లు అనుమానాలు!
Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఓ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం షాహీబాగ్ హోటల్ సమీపంలో కుప్పకూలింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఘటన జరిగిన వెంటనే పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోవడం, భారీ పేలుళ్ల శబ్దంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విమానంలో బిజినెస్ క్లాస్‌లో సీట్ నెంబరు 2 ఆయన పేరు మీద బుక్ అయినట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ఆకాశంలో అసమాన్యంగా కదిలిందని, అనంతరం పెద్ద శబ్దంతో నేలపై కుప్పకూలిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభావిత ప్రయాణికులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కుప్పకూలిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 మోడల్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే భూమిపైకి పడిపోవడంతో ప్రాథమికంగా యంత్రాంగ వైఫల్యం, సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి వివరాలను పౌర విమానయాన శాఖ ప్రకటించాల్సి ఉంది.
ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆయన హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయలుదేరారు. కాగా ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఆయన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడి ప్రమాద స్థితిగతులను, సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు.
ప్రస్తుతం ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విమానంలో ఉన్న ప్రయాణికుల వివరాలు, వారి స్థితిగతులు, తీవ్రంగా గాయపడినవారి సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విమాన ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుండగా, పూర్తిస్థాయి నివేదికను డిజీసీఏ, బోయింగ్ సంస్థలతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ రూపొందించనున్నట్టు తెలుస్తోంది.