
Mulugu: ములుగు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మెడికల్ లీవ్స్ జీతం మంజూరు చేసేందుకు రూ.25వేల లంచం(Bribe) తీసుకుంటూ కార్యాలయ సూపరింటెండెంట్ జి సుధాకర్ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. సదరు ఉద్యోగి ఇటీవల అనారోగ్య సమస్యలతో మెడికల్ లీవ్స్ వినియోగించుకున్నారు. ఈ సెలవుల కాలానికి సంబంధించిన జీతం బిల్లులు తయారు చేసేందుకు, జిల్లా ఖజానా కార్యాలయానికి పంపేందుకు సుధాకర్ రూ.25వేలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఆ డబ్బు అందించే క్రమంలో మధ్యవర్తిగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ సౌమ్యతో పాటు సూపరింటెండెంట్ సుధాకర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా సేవలు అందించేందుకు లంచం అడిగితే ప్రజలు అవినీతి నిరోధక శాఖ టోల్‌ఫ్రీ నెంబరు 1064 ద్వారా గానీ, వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.