
Hyderabad: తెలంగాణాలో అవినీతి నిరోధక శాఖ(ACB) ఆక్టివ్‌గా మారింది. గతంలో అప్పుడప్పుడూ దాడులతో వార్తల్లో నిలిచే ఏసీబీ.. ఇప్పుడు ఒకేరోజులో రెండు మూడు మెరుపు దాడులతో ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఒక్కో డిపార్ట్మెంట్ మీద నిఘా పెట్టి అవినీతి అధికారుల ఆటకట్టిస్తున్న ఏసీబీ అధికారులు ఇప్పుడు పోలీస్ శాఖను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మంగళవారం సూర్యాపేట(Suryapeta) డీఎస్పీ పార్థ సారథి, ఇన్స్పెక్టర్ వీర రాఘవులను ఓ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా.. బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్‌పై దాడులు చేసి కేసు నమోదు చేశారు.
ఓ వ్యక్తిని అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి స్కానింగ్ సెంటర్ యథావిధిగా నడుపుకోవడానికి అనుమతులిచ్చేందుకు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు సూర్యాపేట డివిజన్ డీఎస్పీ పార్థ సారథి, సీఐ వీర రాఘవులు. ఈ కేసులో బాధితుడి అభ్యర్థనకు తగ్గి చివరకు రూ.16 లక్షల లంచానికి(Bribe) డీల్ సెట్ చేశారు. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. వలపన్ని ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా.. బుధవారం కామారెడ్డి జిల్లా పరిధిలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్‌పై ఆకస్మిక దాడులు చేసింది ఏసీబీ. 10 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని.. స్టేషన్ నుంచి విడిపించేందుకు లంచం డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో బుధవారం స్టేషన్‌కు చేరుకున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు చేయకుండా ఠాణాలోనే ట్రాక్టర్లు ఉంచడంతో పాటు పలు ఇతర కేసుల్లోనూ అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఏసీబీ ట్విటర్ వేధికగా ప్రకటించింది.