ACB Raid: థాయ్‌లాండ్‌లో పెళ్లి ప‌ట్టించింది.. బాబోయ్‌ ఇన్ని ఆస్తులా..?

ACB Raid on Kaleshwaram EE Sridhar

Share this article

ACB Raid: తెలంగాణ ఏసీబీ అధికారుల వ‌ల‌లో ఓ భారీ తిమింగ‌లం చిక్కింది. నీటిపారుద‌ల శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ గా ప‌నిచేస్తున్న నూనె శ్రీధ‌ర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బుధ‌వారం ఏసీబీకి చిక్కారు. బుధ‌వారం ఉద‌యం నుంచే హైద‌రాబాద్‌, కరీంన‌గ‌ర్‌, బెంగ‌ళూరు స‌హా మొత్తం 13 ప్రాంతాల్లో ఏక‌కాలంలో ఏసీబీ అధికారులు దాడులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ దాడుల్లో దాదాపు రూ.100కోట్ల‌కు పైగా అక్ర‌మ సొమ్ము ఇప్ప‌టికే ప‌ట్టుబ‌డ‌గా.. మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రుగుతోంది. అయితే, ఈ దాడుల‌కు ఇటీవ‌ల ఆయ‌న కుమారుడి పెళ్లి థాయ్‌లాండ్‌లో చేయ‌డ‌మేన‌ని చెబుతున్నారు. థాయ్‌లాండ్‌లో కుమారుడికి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసిన ఈఈ శ్రీధ‌ర్‌.. హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా హ‌ల్దీ వేడుక‌లు, రిసెప్ష‌న్ వేడుక‌లు చేశారు. వీటికి పెట్టిన ఖ‌ర్చే ఏసీబీకి అనుమాన‌మందించింది. దీంతో కూపీ లాగిన ఏసీబీ అధికారులు దాడులు చేసి గుట్టు బ‌య‌ట‌పెట్టారు.

బుధ‌వారం దాడులు జ‌రిగే స‌మ‌యంలోనే ఏసీబీ అధికారులు ఆయన్ని చొప్పదండి డివిజన్‌లో అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించగా, గురువారం తెల్లవారుజామున చంచల్‌గూడా జైలుకు రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం శ్రీధర్ బ్యాంకు లాకర్లను తెరిచేందుకు ఏసీబీ అధికారులు కస్టడీకి అనుమతి కోరనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు బయటపడిన వివరాల ప్రకారం, ఆయన వద్ద రూ. వందల కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ACB Raid on Kaleshwaram EE Sridhar

బాబోయ్ ఇన్ని ఆస్తులా..!
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నాలుగంతస్తుల లగ్జరీ భవనం, షేక్‌పేటలోని గేటెడ్ కమ్యూనిటీ “స్కై హై”లో 4,500 చదరపు అడుగుల ఫ్లాట్, తెల్లాపూర్‌లోని “ఉర్జిత్ ఎన్‌క్లేవ్”లో విలాసవంతమైన విల్లా ఉన్నాయి. వరంగల్‌లో జీ+3 భవనం, కరీంనగర్‌లో మూడు ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ హౌస్, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, ఆస్తుల రూపంలో వాణిజ్య భవనాలు, అలాగే పలు హోటళ్లలో వ్యాపార భాగస్వామ్య డాక్యుమెంట్లు బయటపడ్డాయి.

ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, శ్రీధర్ వద్ద రెండు విలువైన కార్లు, భారీ మొత్తంలో బ్యాంక్ డిపాజిట్లు, లాకర్ల వివరాలు బయటపడ్డాయని, ఇంకా పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 100 కోట్ల పైగా ఉండే అవకాశం ఉంది.

కాళేశ్వ‌రంలోనే దండుకున్నారు!
నూనె శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో గాయత్రి పంప్ హౌస్, చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలంలో నిర్మించిన మరో భారీ పంప్ హౌస్ బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో ఆయన భారీ కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. అదే కారణంగా ఏసీబీ అధికారులు అతనిపై దృష్టి సారించారు.

ఆ పెళ్లే ప‌ట్టించింది!
ఇప్ప‌టివ‌ర‌కూ ప‌బ్లిక్ లైఫ్‌కి దూరంగా ఉన్న శ్రీధ‌ర్.. మార్చిలో జ‌రిగిన త‌న కుమారుడి వివాహంతో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చారు. కుమారుడి కోరిక మేర‌కు థాయ్‌లాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ అత్యంత ఘనంగా నిర్వహించగా, వేడుకలపై ఖర్చు చేసిన రూ.కోట్లు చూసినవారు ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ శివార్లలోని ఫాంహౌస్‌లో హల్దీ, సంగీత్ ఫంక్షన్లు, నాగోలులో శివం కన్వెన్షన్‌లో రిసెప్షన్, తదితర వేడుకలపై పెట్టిన ఖ‌ర్చులు ఏసీబీ అధికారుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో అతనిపై విచారణ ప్రారంభమైంది.

ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీధర్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడం అధికార యంత్రాంగంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు తెలంగాణలో కాంట్రాక్ట్ ప్రాజెక్టుల పర్యవేక్షణలో ఉన్న అవకతవకలకు అద్దం పట్టే ఘటనగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *