Epstein Files: బ్రిట‌న్ ప్ర‌ధానిగా తొలి ముస్లిం మ‌హిళ‌..?

Share this article

పాకిస్థాన్ సంత‌తి నేత‌కే జై కొడుతున్న లేబ‌ర్ పార్టీ నేత‌లు..

Epstein Files: బ్రిటన్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయి. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’(Epstein Files) పరిణామాలు అధికార లేబర్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. ఈ సంక్షోభం నేరుగా ప్రధాని కీర్ స్టార్మ‌ర్ (Keir Starmer) కుర్చీని వణికిస్తోంది. ఈ రాజకీయ తుఫాన్ మధ్య ఓ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె మరెవరో కాదు.. ష‌బానా మహమూద్.

స్టార్మర్ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే, తదుపరి ప్రధాని రేసులో ష‌బానా మహమూద్‌కే తొలి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, బ్రిటన్ చరిత్రలో తొలి ముస్లిం మహిళా ప్రధానిగా, తొలి పాకిస్థాన్ సంత‌తికి చెందిన ప్ర‌ధానిగానూ.. ఆమె నిలిచే అవకాశం ఉంది.

ఎవరీ ష‌బానా మహమూద్?
ష‌బానా మహమూద్ 1980 సెప్టెంబర్ 17న ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌పూర్ ప్రాంతం నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. విద్యాభ్యాసంలో ప్రతిభ చూపిన ఆమె, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లింకన్ కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె ఒక బారిస్టర్.

2010లో బర్మింగ్‌హామ్ లేడీవుడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ష‌బానా, బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళా ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ హోమ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో లార్డ్ ఛాన్సలర్‌గా, న్యాయ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్… స్టార్మర్‌కు సంక్షోభం
ప్రస్తుత రాజకీయ కలకలానికి మూలం ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’.(Epstein Files) లైంగిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న అమెరికన్ వ్యాపారవేత్త Jeffrey Epsteinతో స్టార్మర్ సన్నిహితుడు Peter Mandelsonకు సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి రావడం పెద్ద దుమారం రేపింది.

ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, బాధ్యత తీసుకుంటూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గన్ మాక్‌స్వీనీ ఫిబ్రవరి 8న రాజీనామా చేశారు. దీంతో ప్రధాని స్థానం మరింత బలహీనపడింది. ఇదే పరిణామాలు ష‌బానా మహమూద్‌కు రాజకీయంగా మార్గం సుగమం చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారత్‌కు సవాలుగా మారే కశ్మీర్ వైఖరి
శబానా మహమూద్ ప్రధాని అయితే భారత్–బ్రిటన్ దౌత్య సంబంధాల్లో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాశ్మీరీ మూలాలు ఉన్న ష‌బానా, భారత్ కాశ్మీర్‌పై అనుసరిస్తున్న విధానాలను గతంలో బహిరంగంగానే విమర్శించారు.

2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసినప్పుడు, లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట జరిగిన నిరసనల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఈ చర్యను ఆమె “కాశ్మీరీ ప్రజలకు జరిగిన ద్రోహం”గా వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ బ్రిటన్ పార్లమెంటులో పలుమార్లు గళమెత్తారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

వలసలపై కఠిన వైఖరి… భారతీయులపై ప్రభావం?
హోమ్ సెక్రటరీగా ష‌బానా మహమూద్ వలసల విషయంలో కఠినమైన వైఖరినే ప్రదర్శిస్తున్నారు. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలన్న ఆమె వాదన, బ్రిటన్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులు, నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

భారత్–బ్రిటన్ సంబంధాలపై ప్రభావం ఎలా?
భారత సంతతికి చెందిన Rishi Sunak హయాంలో భారత్–బ్రిటన్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. వాణిజ్యం, వ్యూహాత్మక సహకారం, రక్షణ రంగాల్లో రెండు దేశాలు మరింత దగ్గరయ్యాయి.

ష‌బానా మహమూద్ ప్రధాని అయితే ఈ సంబంధాలు కొంత అసౌకర్య దశలోకి వెళ్లే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, వ్యక్తిగత అభిప్రాయాల కంటే ‘జాతీయ ప్రయోజనాలే’ ప్రధానం కాబట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె వైఖరిలో మార్పు రావచ్చని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. (Epstein Files)

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *