Breaking: ఒక భర్త డ్రమ్ములో, ఒక భర్త హనీమూన్లో, ఇంకో భర్త కుక్కర్లో.. ఇలా ఒక్కొక్కొరూ ఒక్కోలా కట్టుకున్న భార్యల చేతుల్లో మర్డరైపోతున్నారు. ఈ అంశం ఇప్పటికే అందరినీ కలవరపెడుతూ.. పెళ్లంటేనే భయం పుట్టిస్తుండగా.. బిహార్లో జరిగిన ఓ వింత ఘటన ఒళ్లు జలదరించేలా చేస్తోంది. ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తల మధ్య బుధవారం చిన్న గొడవ మొదలైంది. అది కాస్తా మాటామాట పెరిగి తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన భార్య.. ముద్దు పెడుతున్నట్లు దగ్గరై భర్త నాలుకను కొరికేసింది. కొరికి అలాగే నమిలి ఆ నాలుకను మింగేసింది.
తీవ్ర రక్తస్రావమై భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు, కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఎక్కువగా రక్తం పోవడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మగధ్ వైద్య కళాశాలకు బాధితున్ని తరలించారు. అయితే, దారుణం ఏంటంటే.. ఇంత జరిగాక బాధితున్ని ఆసుపత్రి తీసుకెళ్లిన అనంతరం కూడా అక్కడ భార్యాభర్తలు తీవ్రస్థాయిలో గొడవపడినట్లు సమాచారం.దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.