HHVM Review: ఏళ్లకేళ్లు తెరవెనుకే ఉన్న ఓ సినిమా.. తెర మీదికి వస్తుందంటే ఎప్పుడైనా హైప్ కనిపించిందా అనే ప్రశ్నకు లేదనే సమాధానమే వినిపిస్తుంది. కానీ, అందులో పవన్ కళ్యాణ్ హీరో అంటే..? మరో ఆలోచన ఉంటుందా..? అవును, హరిహర వీరమల్లు సినిమాలోనూ అది మరోసారి నిరూపితమైంది. ఓసారి రాజకీయాలని, ఓసారి కరోనా అని.. మరోసారి దర్శకుడు తప్పుకున్నాడని.. ఇలా ఒకటా రెండో ఎన్నో ఒడిదొడుకుల నడుమ ఏకంగా ఆరేళ్ల తర్వాత తెరమీదకొచ్చిన హరిహర వీరమల్లు ఇప్పడు టాక్ ఆఫ్ ది వరల్డ్. ఏపీ డిప్యూటీ సీఎం పీఠమెక్కాక వస్తున్నది కావడంతో పాటు పవన్ నటించిన మొదటి పీరియాడిక్ డ్రామా కావడంతో ఈ సినిమాకు బీభత్సమైన హైప్ వచ్చింది. అయితే, ఈ సినిమా గురించి దాదాపు సోషల్ మీడియా, ఇతర వెబ్సైట్లు.. 23వ తేదీ సాయంత్రం నుంచే రివ్యూలు వదులుతున్నాయి. అంత సోదేం చెప్పకుండా.. మూడు ముక్కల్లో ఓజీ షార్ట్ రివ్యూ!
ఒకటో ముక్క.. బలాలు:
పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు. ఏళ్లపాటు సినిమా చిత్రీకరణ జరిగినా లుక్స్‌లో ఏ మాత్రం తేడా రాకుండా సినిమాను తెరకెక్కించడంలో సఫలమయ్యారు. యుద్ధ సన్నివేశాలు, పీరియాడిక్ చిత్రాలనగానే బాహుబలి ప్రభాస్, రానా కళ్ల ముందు మెదులుతారు. ఈ సినిమాలో వీరోచిత పాత్రగా కనిపించిన వీరమల్లుకు.. బాహుబలి స్థాయి కండలు లేకపోయినా.. పవన్ కంటిచూపుతోనే పాత్రకు పవర్ అందించారు. మొగలుల పాలనలో హిందువులపై జరిగిన దమనకాండలు, జిజియా పన్ను, మత మార్పిడి వేధింపుల కథను తీర్చిదిద్దడంలో క్రిష్ నెగ్గారు. నిధి అగర్వాల్ పాత్రకు న్యాయం చేసింది. తొలి భాగంలో బాబీ డియోల్ ఆకట్టుకున్నారు. రెండో భాగం మొత్తం కీరవాణి సంగీతం సినిమాను నిలబెడుతుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెరకెక్కించిన యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి.

రెండో ముక్క.. బలహీనతలు:
కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ పూర్తిగా విఫలం. రెండో భాగంలో కొన్ని నిమిషాల పాటు సాగదీత సీన్లు. నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోని కొన్ని సీన్లు. కొన్ని సీన్లలో దర్శకత్వ వైఫల్యం.
మూడో ముక్క.. ఎందుకు చూడాలి?
ఓ పీరియాడిక్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటన మెస్మరైజ్ చేస్తుంది. రెగ్యులర్‌గా చూసే పవర్ స్టార్‌కి భిన్నమైన నటున్ని ఈ చిత్రంలో చూస్తారు. కీరవాణి సంగీతం, పాటలు, యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. సనాతన ధర్మం, మొగలుల అసలు చరిత్ర, భారతీయత కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. వీఎఫ్ఎక్స్ నచ్చకపోయినా, ట్విస్టులేం పెద్దగా లేకపోయినా.. భారతీయ వీరుడు వీరమల్లు సినిమాలా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలా, మన సినిమాలా ఫీలైతే ఓసారి చూడాల్సిన సినిమా.
ఫైనల్‌గా.. ఈ రివ్యూ కూడా థియేటర్లో మూడు గంటలు మాకు అనిపించిందే మేం రాశాం. మిగతా సినిమాల్లో లాభాలు హీరోలకైతే, ఈ సినిమాలో పవన్ కు వచ్చే లాభాలు ఎలాగో జనాలకే వెళ్తాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. అందుకోసమైనా సినిమా చూడాలని మేం చెబుతాం. ఎవరి మాటా వినొద్దు.. మా మాట కూడా!
ఓజీ రేటింగ్:
2.75/5 – ఓవరాల్ సినిమా
3.75/5 – పవన్ కళ్యాణ్ నటన
3.5/5 – నిధి అగర్వాల్, ఇతర నటుల నటన
3.5/5 – కథ
HariHara Veeramallu Review | HHVM Review | HariHaraVeeramallu Genuine Review