YCP: ఆంధ్రప్రదేశ్ మాజీ అధికార పార్టీ వైసీపీ గుర్తు మార్చాలంటూ ఆ పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్ రాసిన లేఖ ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం తన పార్టీకి ఫ్యాన్ గుర్తు కొనసాగుతుందని.. ప్రస్తుత పరిస్థితులు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గొడ్డలి గుర్తు కేటాయించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై శివ కుమార్తో సహా వైసీపీ నాయకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదని కొన్నేళ్లుగా శివకుమార్ పోరాడుతున్నారు. తను నమోదు చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును, జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని.. ఆ పార్టీ తనదేనని ఆయన వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం పలు కామెంట్లు చేసిన శివకుమార్.. తాజాగా పార్టీ గుర్తును మార్చాలంటూ ఏకంగా కేంద్ర ఎన్నిక సంఘానికి సంచలన లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది.
లేఖ సారాంశం.. నా పేరు శివకుమార్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకున్ని. ఎన్నికల సంఘంతో నమోదైన నా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తు మార్చాలని ఈ లేఖ రాస్తున్నాను. ప్రస్తుతం మా పార్టీ ఫ్యాన్ గుర్తును వినియోగిస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాల దృష్ట్యా ఆ గుర్తను గొడ్డలిగా మార్చాలని పార్టీలో ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. మా భవిష్యత్తు నిర్ణయాలు, పార్టీ గుర్తింపు, రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ గుర్తు సరిపోతుందని భావిస్తున్నం. ఎన్నికల గుర్తుల ఆర్డర్ 1968 ప్రకారం గొడ్డలి గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు, పార్టీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయాలు, అఫిడవిట్లను మీకు సమర్పిస్తున్నాం. అంటూ రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై వైకాపా నాయకులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

