Janasena: పార్టీ గీత దాటారంటూ కొవ్వూరు సీనియర్ నేత, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ టీవీ రామారావు బహిష్కరణ.. ఒక్కరోజు గడవక ముందే, వార్త బయటకి వచ్చి కార్యకర్తలు తేరుకునే లోపే.. పార్టీలో ఏళ్లుగా కీలకంగా ఉంటోన్న శ్రీకాళహస్తి నేతలు కోట వినూత, ఆమె భర్త చంద్రబాబుపై వేటు.. ఇది మొదలు కాదు.. గతంలోనూ పార్టీ సిద్ధాంతాలకు కాస్త అటూ ఇటూ ఉన్నా, తప్పు చేస్తున్నారని ఆరోపణ వినిపించినా పార్టీ సహించలేదు. వెంటనే వేటు వేసేసింది. నాడు కళ్యాణ్ దిలీప్ సుంకర నుంచి నేడు కోట వినూత దాకా.. ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే జనసేన పార్టీ ప్రత్యేకత. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. రాజకీయ పార్టీలో ఇలాంటివి సర్వసాధారణమని పక్కనున్న వాళ్లు చెబుతూ వచ్చినా ఎక్కడా తగ్గని వ్యక్తిత్వం జనసేనాని పవన్ కళ్యాణ్‌ది.
ఏ విలువల మీదైతే పార్టీని నిలబెట్టారో.. అవసరాల కోసం ఆ విలువలు తాకట్టు పెట్టే రోజొస్తే తప్పుకుంటానే తప్ప తప్పు చేయనని చెప్పిన మాటలు అందరి నాయకులు చెప్పినట్టు కాదు. ఆ మాటే శాసనం. చెప్పాడంటే.. చేస్తాడంతే. ఇది జనసేన పార్టీలో కొందరు నాయకులూ, కార్యకర్తలకు నొప్పి అనిపించినా.. ఇదే కరెక్టు. తప్పులు చేసి ఓ ఐదేళ్లు అధికారంలో ఉండి, తప్పుల్ని వెనకేసుకొచ్చి ఇంకో పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి.. కొన్నేళ్లకు ఉనికే లేకుండా మాయమయ్యే పార్టీల కంటే.. నిజాయతీగా, నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకు ఏళ్లపాటు ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలబడే పార్టీలదే అంతిమ విజయం. అందులో జనసేన పేరుంటుందని ఆశించడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఆ పార్టీకి ఏమైందో చూశారా..?
గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 151. ఇందులో 50 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ నేరారోపణలు, మర్డర్లు, దాడులు తదితర కేసులున్నాయి. మిగతా 101 మందిపై కనీసం 2 పెండింగ్ కేసులున్నాయి. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక్కడిపైనే 150 పెండింగ్ పిటిషన్లు, 31 సీరియస్ పెండింగ్ కేసులు, ఇందులో 26 సీబీఐ దగ్గరే పెండింగ్ ఉండటం గమనార్హం. దీనికి తోడు, ఆ పార్టీలో ఓ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ బయటికొచ్చినా.. ఓ ఎమ్మెల్యే మహిళతో తప్పుగా ప్రవర్తిస్తూ వీడియోలు బయటపడినా, ఓ ఎమ్మెల్యే ఆడియో కాల్ సంచలనం సృష్టించినా, ఓ ఎమ్మెల్సీ దళితున్ని చంపి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలున్నా.. సొంతంగా అధినేత కుటుంబంలోని ఓ ఎంపీ సొంత చిన్నాన్నను హత్య చేయించారన్న ఆరోపణలొచ్చినా.. పార్టీ ఎప్పుడూ కనీసం ఖండించలేదు సరికదా ఆ నేతలందరినీ వెనకేసుకొచ్చింది. ఆరోపణ చేసిన వాళ్లనే అంతం చేసే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడేమైంది..? జనానికే విరక్తి పుట్టి పక్కన కూర్చొబెట్టే రోజొకటి రాలేదూ..? ఒక్క వైసీపీదే కాదు రాజకీయ క్షేత్రంలో చాలా పార్టీలది ఇదే కథ.
భాజపాను అప్రహతిహతంగా..
1951లో పుట్టిన జన్ సంఘ్ నుంచి నేటి భారతీయ జనతా పార్టీ దాకా దాదాపు డెబ్భై ఐదేళ్ల రాజకీయ చరిత్ర. ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడిన ఆ పార్టీ 2014 నుంచి నేటి దాకా అప్రతిహతంగా తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తోంది. ఇంకే పార్టీకి దక్కని పవర్‌ఫుల్ పొలిటికల్ పవర్ ఆ పార్టీ చేతిలో ఉంది. రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఓట్లో స్థానిక నేతల్ని చూసే జనం కూడా పార్లమెంటు స్థానాల విషయంలో కళ్లు మూసుకుని కమలంపై ఓటు వేస్తున్నారంటే దాని ప్రభావం జనాల్లో ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి కేవలం నిబద్ధత, నమ్మిన సిద్ధాంతంపై బలంగా ఏర్పడిన పునాదులే.
పవన్ అప్పుడే చెప్పారు..
నేర చరిత్ర లేని రాజకీయ నాయకుల్ని తయారు చేస్తామని, రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తానని ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ 2014లోనే చెప్పారు. అప్పటి 2014 ఎన్నికల్లో, మొన్నటి 2024 ఎన్నికల్లో వైకాపాను తుదిముట్టించేందుకు కంకణం కట్టుకున్నదీ అందుకే. 2024 ఎన్నికల ప్రచారంలోనూ.. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే తనకు అసలే నచ్చదని తేల్చేశారు పవన్ కళ్యాణ్. ఈ గూండాలు, రౌడీలు, హంతకులా మనల్ని పాలించేది..? నేర చరిత్ర ఉన్న ఈ నాయకుల చేత పాలించబడటానికి మనకి సిగ్గుండాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఆయన స్టాండ్ అదే. ఏ కాస్త క్రిమినల్ మైండ్ సెట్ ఉందని తేలినా.. తప్పు చేస్తున్నారనే భావన కలిగినా.. ఎలాంటి బేషజాల్లేకుండా ఎంత దగ్గరి వారైనా పక్కన పెట్టడం పవన్ నైజం. ఇప్పుడు అదే శ్రీకాళహస్తి నేతల విషయంలో జరిగింది. కోట వినూత విషయంలో జరిగింది తప్పే అనిపించినా.. ఆరోపణలు అబద్ధం అని తేలేదాకా వేటు తప్పదు.

ప్రశ్నిద్దాం.. కానీ ఎంత మూల్యానికి..?
మారుతున్న పరిస్థితుల్లో కుటుంబాల్లోనే సఖ్యత లేదు. ఒకరికి ఒకటి నచ్చితే, ఇంకొకరికి ఒకటి నచ్చుతుంది. ఏ ఒక్కరూ ఒక్కతాటిపై ఉండరు. అరమరికలు సహజం. అలాంటిది, మూడు భిన్న అభిప్రాయాలున్న రాజకీయ పార్టీలో ఒకే ఛట్రంలో ఉండాలంటే..? ఎంత తగ్గాలి..? ఎంత ఓపిక ఉండాలి..? మీరన్నట్టు న్యాయం జరగట్లేదు సరే.. చెప్పుకునే వేధికల్లేవా..? నాయకుల్లేరా..? ఓ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎవరికి నష్టం..? పార్టీకే కదా..? ఆ నేతపై ఓ నర్సింగ్ విద్యార్థిని హత్యాచారం కేసులో ఆరోపణలున్నాయని.. గతంలో తప్పులు చేశారని అధిష్టానానికి తెలిసినా పార్టీలోకి ఆహ్వానించారు. అలా అని బహిష్కృత నేత వ్యక్తిత్వాన్ని శంఖించడం ఉద్దేశం కాదు.
కానీ, సంయమనం పాటించలేని కార్యకర్తలు, నాయకులే ఇప్పుడు పార్టీకి ప్రధాన శత్రువులని మరిచిపోవద్దు. జనసేనకు ఈ ఎన్నికల్లో అధికారం కాదు.. రాష్ట్రంలో అభివృద్ధి మాత్రమే లక్ష్యమనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇటు పొత్తులో ఉంటూనే, అభివృద్ధిలో భాగమవుతూనే పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నది నాయకత్వానికి తెలుసుననే విషయమూ గుర్తుంచుకోవాలి. కాస్త ఆలస్యమైనా మార్పు ఉంటుంది. ఆ మార్పును భవిష్యత్తే చెబుతుంది. నాయకుడు ఏం చేసినా కరెక్టే అనుకునే పార్టీలు, సంస్థల భవిష్యత్తే బలంగా ఉంటుంది. ఇప్పుడు జనసేన ఓ రాజకీయ పార్టీగా బలపడాలంటే ఆ బలమైన నమ్మకం ఉండి తీరాలి కూడా.