Raid: మొబైల్ ఉత్పత్తుల విక్రయ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని కోఠి, సుల్తాన్ బజార్లో ఉన్న ఓ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఉత్పత్తుల దుకాణంలో బీఐఎస్ ధ్రువీకరణ లేని ఛార్జర్లు అమ్ముతున్నారన్న సమాచారంతో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో.. వివిధ బ్రాండ్లకు చెందిన మొబైల్ ఛార్జర్లకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని, కొన్ని నకిలీ రిజిస్ట్రేషన్ మార్క్ ముద్రించినట్లు గుర్తించిన అధికారులు వాటిని జప్తు చేశారు. బీఐఎస్ సెక్షన్ 2016 కింద నిర్వాహకులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో.. డైరెక్టర్ సుజాత, జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరుల బృందం ఈ దాడుల్లో పాల్గొంది.

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి అని బీఐఎస్ డైరెక్టర్ పీవీ శ్రీకాంత్ పేర్కొన్నారు. వీటికి ధ్రువీకరణ లేకుండా, రిజిస్ట్రేషన్ మార్క్ లేకుండా విక్రయించినా, నిల్వ చేసినా, తయారు చేసినా బీఐఎస్ కఠిన చర్యలు చేపడుతుందన్నారు. బీఐఎస్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా (మొదటి ఉల్లంఘనకు), తర్వాతి ఉల్లంఘనలకు రూ. 5 లక్షల దాకా జరిమానా లేదా సరుకు విలువ 10 రెట్లు జరిమానా విధించబడవచ్చు.
ప్రస్తుతం వరకు 769 ఉత్పత్తులపై QCOలు జారీ చేయబడ్డాయి. వీటి వివరాలు BIS వెబ్సైట్లో (www.bis.gov.in) చూడవచ్చు. వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వస్తువుల నాణ్యతను తక్షణమే ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. యూట్యూబ్ లో స్టాండర్డ్స్ వాచ్ పేరిట ప్రతీ శుక్రవారం ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని.. ప్రతీ వినియోగదారుడు తప్పక చూడాలని ఆయన కోరారు.

About life