HYDRAA: చెరువులు మ‌ళ్లీ పుడుతున్నాయ్‌.. శ‌భాష్ హైడ్రా!

HYDRAA Special Story

Share this article

HYDRAA: మార్పు మొద‌లైంది.. ఆ మార్పును ప్ర‌జ‌లే ద‌గ్గ‌రుండి ఆహ్వానించే రోజులొచ్చాయి. చిన్న వ‌ర్షానికే చిత్త‌డ‌య్యే మ‌హాన‌గ‌రం.. భీక‌ర వాన‌ల‌కూ ప్ర‌శాంతంగా నిదురిస్తోంది. ఎక్క‌డిక‌క్కడ నిర్మించిన‌, నిర్మిస్తోన్న డ్రైన్ల‌తో.. వ‌ర‌ద నీరంతా సాఫీగా సాగిపోతోంది. నీటి నిల్వ‌ల్లేవు.. ముంపు వార్త‌ల్లేవు.. తెల్లారే స‌రికి చుక్క‌నీరు క‌నిపించ‌కుండా మాయ‌మైపోతోంది. నిర్మాణాల నిర్బంధాల‌తో కుచించిన నాలాలు.. రెక్క‌లు విప్పుకు పారుతున్నాయి. చ‌చ్చిపోయిన చెరువులు.. మ‌ళ్లీ పుడుతున్నాయి. నిండా నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఖాళీ జాగా క‌నిపిస్తే బోర్డు పాతేసే రోజులు పోయి.. చేసిన కబ్జాలూ వ‌దిలేసి పారిపోయే రోజులొచ్చాయి. అడుగ‌డుగునా అడ్డంకులెదుర‌వుతున్నా.. త‌ట్టుకొని నిల‌బ‌డుతున్న హైడ్రా (HYDRAA).. ఓ భారీ మార్పున‌కూ శ్రీకారం చుడుతోంది. భ‌విష్య‌త్తే రుణ‌ప‌డిపోయేలా.. హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దుతోంది.

HYDRAA
HYDRAA Commissioner Ranganath IPS

ఏం మారింది..?
రంగనాథ్ ఐపీఎస్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హైడ్రా నిర్ణ‌యం కంటే, ఆయ‌న్ను క‌మిష‌న‌ర్‌గా నియ‌మించ‌డంపై ఎక్కువ ప్ర‌శంస‌లొచ్చాయి. సీఎం రేవంత్ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం గ్రౌండ్‌లో ఇప్పుడు ఫ‌లితాల్ని చూపిస్తోంది. స్థాయి, హోదాలతో సంబంధం లేకుండా, అధికార ప్ర‌తిప‌క్ష తేడా లేకుండా.. ఆక్ర‌మ‌ణ పేరు వినిపిస్తే చాలు అక్క‌డ హైడ్రా వాలిపోతోంది.. ఆ నిర్మాణం కూలిపోతోంది.

ఏళ్లుగా న‌ర‌కం చూపిస్తోన్న బేగంపేట నాలా నుంచి.. మ‌ళ్లీ పురుడు పోసుకున్న బ‌తుక‌మ్మ కుంట‌, మార్పును చూడ‌బోతున్న సున్నం చెరువు, త‌మ్మ‌డికుంట‌, కూక‌ట్‌ప‌ల్లిలోని న‌ల్ల‌చెరువు, ఉప్ప‌ల్‌లోని న‌ల్ల‌చెరువు, పెద్ద చెరువు, పాత‌బ‌స్తీలోని బ‌మృక్ నుద్దౌలా చెరువు.. ఇలా ఏ చెరువును అడిగినా మార్పేంటో చెబుతాయి. మూడుగంట‌ల్లో ప‌రిష్కారం చూసిన జీడిమెట్ల రుక్మిణీ ఎస్టేట్స్ పార్కు, ఆక్ర‌మణ‌ల చెర నుంచి బ‌య‌ట‌ప‌డ్డ రెడ్డి ఎన్‌క్లేవ్ పార్కు.. బ‌డికి బాట ద‌క్కిన దూద్‌బావి స‌ర్కారు బ‌డి పిల్ల‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

HYDRAA Story

ఎందుకు..?
హైద‌రాబాద్ జ‌నాభా కోటిన్న‌ర‌. బ్రిట‌న్‌, స్వీడ‌న్ లాంటి దేశాల కంటే ఎక్కువ జ‌నాభా. పెరుగుతున్న వ్య‌క్తిగ‌త వాహ‌నాలు, అవ‌స‌రాల‌కు మించి పెరుగుతున్న నిర్మాణాలు భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థ‌కం చేస్తున్నాయి. చిన్న వాన ప‌డితే అడుగు క‌ద‌ప‌లేని స్థితికి చెన్నై, బెంగ‌ళూరులాంటి మ‌హాన‌గ‌రాలు చేరిపోయాయి. దీనికి కార‌ణం స‌రైన డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌, నీటి నిల్వ‌కు భూమి లేక‌పోవ‌డ‌మే. దేశంలో అన్ని న‌గ‌రాల‌ కంటే ముందే అత్యంత‌ ప‌టిష్ట డ్రైనేజీ వ్య‌వ‌స్థ, గొలుసుక‌ట్టు చెరువుల్ని చూసిన హైద‌రాబాద్ ఇప్పుడు ఆక్ర‌మ‌ణ‌ల‌కు కుదేలైపోయింది. గ‌డిచిన 20ఏళ్లలో 4200కు పైగా చెరువులు ఉనికే లేకుండా మాయ‌మ‌య్యాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌తీ ఏటా వ‌ర్షాల‌కు భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టాల‌ను చూసే స్థితికి దిగ‌జారింది. దీనికి ఏకైక ప‌రిష్కార‌మే హైడ్రా.

కూల్చివేత‌లే కాదు.. ఇంకేం చేస్తోంది..?
మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌ల పేరిట 4100 మంది నిపుణుల‌తో హైడ్రా 150 బృందాల‌ను ఏర్పాటు చేసింది. ఎక్క‌డ వ‌ర్షం నీటి నిలువ ఉన్నా నిమిషాల్లో భారీ హైప‌వ‌ర్ మోటార్ల‌తో ఈ నిపుణులు నీరు తోడేస్తున్నారు. వ‌ర్ష‌పు నీరు ఎక్కువ‌గా నిలిచే చోట‌.. గ‌తంలో స‌మ‌స్య‌లు త‌లెత్తిన చోట 368 స్టాటిక్ టీమ్‌లు షిఫ్టుల వారీగా ప‌నిచేయ‌నున్నాయంటే మాట‌లు కాదు. జూలై 1వ తేదీ నుంచి ఈ బృందాలు హైద‌రాబాద్‌లో విస్తృతంగా ప‌నిచేస్తున్నాయి.

వాన‌ల‌పై క‌చ్చిత‌మైన సమాచారం..
ఓ తెలుగు సినిమాలో కామెడిగా చెప్పిన‌ట్లు.. వాతావ‌ర‌ణ శాఖ చెబితే ఆరోజు వాన ప‌డ‌ద‌నే ట్రోల్ జ‌నాల్లో ఉంది. ఇది తీవ్ర ప్ర‌భావ‌మూ చూపిస్తోంది. దీన్ని మార్చి వాన‌ల‌పై క‌చ్చిత‌మైన స‌మాచారం అందించేందుకూ హైడ్రా న‌డుం బిగించింది. హైడ్రా, వాతావ‌ర‌ణ శాఖ‌(ఐఎండీ), తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేష‌న్స్ సెంట‌ర్‌, తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌, ఐఐటీ హైద‌రాబాద్‌తో క‌లిసి ఒక వ‌ర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు నిర్ణ‌యించారు. ఈ విభాగాల‌న్నీ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి వ‌ర్షాన్ని అంచ‌నా వేయ‌డంతో పాటు.. త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేస్తాయి.

HYDRAA

కాలుష్యానికి క‌ళ్లెం..!
ఓఆర్ఆర్ ప‌రిధిలోని చెరువుల కాలుష్యంపైనా హైడ్రా దృష్టి సారించింది. ఇక్క‌డి 549 చెరువుల‌కు స‌ర్వే నిర్వ‌హించ‌డంతో పాటు ఎప్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌ను గుర్తించి 411 చెరువుల‌కు ఇప్ప‌టికే హైడ్రా అధికారులు ప్రిలిమిన‌రీ నోటిఫికేష‌న్ ఇచ్చారు. 138 చెరువుల‌కు ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ఇచ్చారు. జియో ట్యాగింగ్ శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా.. ఇప్ప‌టికే ప‌లు కీల‌క ప్రాంతాల్లో అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చి వేసి చెరువుల్ని పున‌రుద్ధ‌రిస్తున్నారు. మ‌రోవైపు కొన్నిచోట్ల‌ చెరువుల్ని ఆక్ర‌మించి లేక్ వ్యూ పేరిట దందా చేస్తున్న నిర్మాణ సంస్థ‌లు ఈ బ‌హుళ అంత‌స్థుల మురుగును య‌థేచ్ఛ‌గా చెరువుల్లో క‌లిపిస్తున్నాయి. సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు నిర్మించ‌లేద‌న్న ఫిర్యాదుల‌పై స్పందించిన హైడ్రా.. వాటిపైనా ఉక్కుపాదం మోపుతోంది. ఫ‌లితంగా కాలుష్యానికి క‌ళ్లెం వేసి చెరువుల‌ను రివైవ్ చేసే బాధ్య‌త ఎత్తుకుంది.

రాజ‌కీయ, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌మంది హైడ్రాను ఆపాల‌ని చూసినా.. ప్ర‌జ‌ల నుంచి మాత్రం హార‌తుల‌తో స్వాగతం ద‌క్కుతోందన్న‌ది నిజం. భ‌విష్య‌త్తు తెలిసిన ఏ ఒక్క‌రైనా హైడ్రాను త‌ప్ప‌న‌రూ. ఈరోజు వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు.. రేపు స‌మాధానం చెబుతుంది. దేశ‌మే కాదు, ప్ర‌పంచ‌మంతా హైద‌రాబాద్ వైపు చూసే రోజొస్తుంది. శ‌భాష్‌.. హైడ్రా!

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *