Fake cop: న‌కిలీ స‌ర్టిఫికేట్ల‌తో పోలీస్ అవ‌తారం.. పోలీసుల‌కే ట్రైనింగ్‌!

fake cop

Share this article

Fake cop: రాజస్థాన్ పోలీస్ అకాడమీలో రెండు సంవత్సరాల పాటు ట్రెయినీ అధికారిగా వ్యవహరించిన యువతి అసలే ఎలాంటి పోలీస్ పరీక్షా ఎంపికలో ఉత్తీర్ణం కాలేదని తాజా విచారణల్లో వెల్లడైంది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అకాడమీలో చేరిన మోనా బుగాలియా అలియాస్ మూలీ దేవిని పోలీస్ శాఖ చివరకు అరెస్టు చేసింది. ఈ సంఘటన ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపిస్తూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప‌రీక్ష లేకుండానే అకాడ‌మీలో ఎంట్రీ..
2021లో పోలీస్ పరీక్ష రాసిన మోనా బుగాలియా ఫెయిలయ్యింది. కానీ అదే ఏడాది తన పేరును ‘మూలీ దేవి’గా మార్చుకుని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసింది. తనను తాను ఎస్సై ఎంపికైన అభ్యర్థిగా చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల ఎంపికైన ఎస్సై అభ్యర్థుల వాట్సాప్ గ్రూపులోకి చేరింది. తను స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అయ్యిందంటూ చెప్పి రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ట్రెయినీ అధికారిగా చేరిపోయింది.

రెండేళ్లు ట్రైనింగ్‌.. స్టేజీల మీద స్పీచ్‌లు..
రెండు సంవత్సరాల పాటు ఆమె పోలీస్ అకాడమీలో జరిగిన వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంది. ఔట్‌డోర్ డ్రిల్స్, శారీరక శిక్షణ, మరియు అకాడమీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ అధికారులతో కలిసి ఫొటోలు దిగింది. సోషల్ మీడియాలో పోలీస్ అధికారిగా తనను తాను చూపిస్తూ స్ఫూర్తిదాయకమైన పోస్టులు షేర్ చేస్తూ ఇతర అభ్యర్థులకు మోటివేషన్‌గా నిలిచేలా నాటకం నడిపింది. ఓ సందర్భంలో ఐపీఎస్ అధికారుల సమక్షంలో స్టేజీపైనా అద్భుత ప్ర‌సంగంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

అనుమానంతో విచారిస్తే..
ఆమె ప్రవర్తనపై కొందరు ట్రెయినీ అధికారులకు అనుమానం కలగడంతో వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతర్గత విచారణలో ఆమె అసలు పోలీస్ ఎంపికకు సంబంధించదనే విషయం బయటపడింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన మోనా, కుటుంబాన్ని ఇంప్రెస్ చేయడం కోసం, పోలీస్ ఉద్యోగంతో వచ్చే ప్రతిష్ట, సౌకర్యాల కోసం ఈ నాటకం ఆడినట్లు చెప్పింది. అప్పటినుంచి ఏడాదిగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

fake cop

నకిలీ డాక్యుమెంట్లు, పోలీస్ యూనిఫామ్‌లు స్వాధీనం
మోనా బుగాలియా అద్దెకు ఉంటున్న ఇంటిపై సోదా చేసిన పోలీసులు అక్కడి నుంచి రూ.7 లక్షల నగదు, మూడు నకిలీ పోలీస్ యూనిఫామ్‌లు, అకాడమీలో ఉపయోగించిన ప్రశ్నాపత్రాలు, పలు నకిలీ ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్వస్థలం నాగోర్ జిల్లా నింబాకే బాస్ గ్రామమని, ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన ఏ ఒక్క పరీక్షలోనూ మోనా ఉత్తీర్ణం కాలేదని అధికారిక రికార్డుల ద్వారా నిర్ధారించబడింది.

వ్యవస్థపై తీవ్ర విమర్శలు – భద్రతా లోపాలపై ప్రశ్నలు
ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో నేరుగా పోలీస్ అకాడమీలో చేరి రెండేళ్లపాటు ఎలాంటి అనుమానం రాకుండా శిక్షణ పొందడమే అత్యంత ఆశ్చర్యకరం. ఇది కేవలం వ్యక్తిగత మోసం మాత్రమే కాకుండా, పోలీస్ రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో ఉన్న లోపాలను వెలుగులోకి తీసుకువచ్చిందని నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *