Covid: కర్ణాటక రాష్ట్రంలో నెలరోజుల్లో 20 మందికి పైగా యువకులు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఈ మరణాలు జరిగి ఉంటాయన్న అనుమానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టతకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆ కమిటీ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో తేలిన విషయాలు కీలకంగా నిలిచాయి.
కొవిడ్ టీకాపై నిపుణుల క్లారిటీ
నిపుణుల కమిటీ ప్రకారం, ఆకస్మిక గుండెపోటు మరణాలకు, కొవిడ్ టీకాకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తాము చేసిన విశ్లేషణల్లో తేలిందని వెల్లడించింది. ‘లాంగ్ కొవిడ్’ కారణంగా ఆకస్మిక హృదయ సంబంధిత మరణాలు జరిగే అవకాశం ఉందన్న వాదనకు కూడా ప్రస్తుత గణాంకాలు మద్దతివ్వడం లేదని స్పష్టం చేసింది.
ప్రపంచ స్థాయి అధ్యయనాల విశ్లేషణ
కొవిడ్ వ్యాక్సిన్-గుండెపోటు మధ్య సంబంధంపై ఇప్పటికే పలు దేశాల్లో జరిగిన పబ్లిక్ హెల్త్ అధ్యయనాలను నిపుణుల కమిటీ సమీక్షించింది. వాటిలో చాలావరకు టీకా వల్ల గుండెపోటు ప్రమాదం పెరగడం లేదని స్పష్టమైన సూచనలు కనిపించాయని పేర్కొంది. నిజానికి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచించడాన్ని కూడా కమిటీ ప్రస్తావించింది.

251 పేషెంట్లపై ప్రత్యేకంగా అధ్యయం
ఈ నివేదికకు ఆధారంగా నిపుణులు శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్క్యులర్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న 45 ఏళ్ల లోపు వయసున్న 251 మంది యువకులపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం 2025 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు కొనసాగింది. అలాగే ఇదే వయోరంగానికి చెందిన 2019 (టీకా కంటే ముందు)లోని పేషెంట్ల డేటాతో పోల్చారు. ఈ రెండింటి మధ్య గణాంకపరంగా పెద్దగా తేడా లేనట్టు స్పష్టమైంది.
అవాస్తవ ప్రచారాలకు చెక్
కరోనా టీకా వల్ల హృదయ సంబంధిత మృతి ప్రమాదం పెరుగుతోందని ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై ఈ నివేదిక స్పష్టత ఇచ్చింది. నిపుణుల అధ్యయన నివేదిక ప్రకారం, ఈ ప్రచారాలు వాస్తవాధారంలేనివిగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగ వైద్య సంస్థల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగిందన్న విషయం విశ్వసనీయతకు మరింత బలం ఇస్తోంది.